దళితులనే బలి పశువులను చేస్తున్నారు
తుని: అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు దళితులనే బలిపశువులు చేస్తున్నాయని రాష్ట్ర మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకటరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం స్థానికంగా ఉన్న హోటల్లో దళిత ప్రతినిధులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. దళితులను విభజించి పాలిస్తున్న రాజకీయ పార్టీలను రాజ్యంగ స్ఫూర్తితో ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న ఎస్సీ వర్గీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎస్సీ వర్గీకరణ పేరుతో డీఎస్సీతో సహా వివిధ జాబ్ నోటిఫికేషన్లు విడుదల చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. సోషల్ మీడియా కేసుల విషయంలో ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్ని వర్గాల ప్రజల ఓట్లతో గద్దెనెక్కి నేడు సనాతన ధర్మ రక్షకుడినంటూ రోడ్డెక్కి రచ్చ చేయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. దళిత, క్రైస్తవ, మైనార్టీలపై పవన్‌కల్యాణ్ అభిప్రాయం తెలియజేయాలని డిమాండ్ చేశారు. దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షుడు చప్పిడి వెంగళరావు, దండేల కృష్ణారావు, బోడపాటి సతీష్, పెదపాటి మేగరంజన్, ఇంజరపు నరహింహమూర్తి, గారా చంటి, చోళ్ల రాజు, కాలా మహర్, బర్రే మధు, బోడపాటి శ్రీను పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment