● 30 వేల కార్మికులను రోడ్డున పడవేయొద్దు
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మధు
కాకినాడ సిటీ: కాకినాడ పోర్టులో అక్రమాలు జరుగుతున్నాయన్న సాకుతో కాకినాడ పోర్టును దిగజార్చవద్దని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాటిపాక మధు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోరారు. సోమవారం కాకినాడలో జరిగిన పార్టీ సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. కాకినాడ పోర్టుకు చరిత్ర ఉందని 200 సంవత్సరాల క్రితమే కాకినాడ పోర్టు ఏర్పడిందన్నారు. 1995 సంవత్సరం నుంచి బియ్యం ఎగుమతులు ప్రారంభించారన్నారు. ఈ పోర్టును నమ్ముకుని 30 వేల మంది కార్మికులు బతుకుతున్నారన్నారు. పోర్టులో పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారన్న ఆరోపణలు నిజమైతే అధికారంలో ఉన్నది మీరే కాబట్టి వెంటనే సీబీఐ విచారణ చేపట్టాలని మధు కోరారు. కాకినాడ యాంకరేజ్ పోర్టును అభివృద్ధి చేయడానికి గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కాకినాడ ప్రతినిధులు ఎంతగానో కృషి చేశారని తెలిపారు. ఈ రోజు మీరు కొత్తగా వచ్చి పూర్తిగా అవగాహన చేసుకోకుండా రాజకీయ అవసరాల కోసం ఏవేవో మాటలు మాట్లాడుతున్నారని, ఇది సరైనది కాదని మధు పేర్కొన్నారు. నిజంగా పీడీఎస్ బియ్యం అక్రమంగా ఎగుమతులు జరుగుతుంటే గొడౌన్‌లో చెక్ చేయాలని, రైస్ మిల్లుల్లో సీసీ కెమెరాలు పెట్టి పూర్తిగా నిఘా ఉంచాలని మధు కోరారు. పోర్టు ఎంట్రన్స్‌లో చెక్ పోస్టు పెట్టడం వల్ల 7 గంటల్లో చేసే లోడింగ్ మూడు రోజులు పడుతుందని, దీనివల్ల కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని మధు వివరించారు. కాకినాడ పోర్టులో చొరబాటుదారులు గంజాయి, మత్తు పదార్థాలకు వస్తున్నారని చెప్పడం సింగం సినిమాను తలపిస్తుందన్నారు. నిరంతరం కోర్టుగార్డ్స్, నేవీ పహారాలు పోర్టు నడుస్తుందని అది మీకు తెలియదా అని మధు గుర్తు చేశారు. మీరు పోర్టులో పట్టుకున్న బియ్యం అంతకు ముందే కలెక్టర్ వెళ్లి చూశారని, దానిపై ప్రకటన ఇచ్చారని మళ్లీ మీరు వచ్చి పట్టుకున్నట్లు యాక్టింగ్ చేయడం కరెక్టు కాదని పవన్‌కళ్యాణ్‌కు మధు హితవు పలికారు. ప్రభుత్వంలో ఉన్న మీరు ఈ పాత్ర చేయడం సరైంది కాదన్నారు. కాకినాడ పోర్టును తరుచూ కించపరచవద్దని, తప్పు జరిగితే సీబీఐ విచారణ చేసి బియ్యం దొంగలను అరెస్టు చేయాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కె.బోడకొండ పాల్గొన్నారు.
డీఎల్‌ఎడ్–1 సప్లిమెంటరీ
పరీక్ష ఫలితాల విడుదల
రాజమహేంద్రవరం రూరల్: డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎల్‌ఎడ్) ప్రథమ సంవత్సరం సప్లిమెంటరీ (2018–20 మేనేజ్‌మెంట్ అండ్‌స్పాట్ బ్యాచ్) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయని బొమ్మూరులోని జిల్లా ప్రభుత్వ విద్యాశిక్షణ సంస్థ(డైట్) ప్రిన్సిపాల్ డాక్టర్ ఏఎం జయశ్రీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. నవంబర్‌లో జరిగిన ఈ పరీక్షలకు 917మంది హాజరుకాగా, 544 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. 59.32 శాతం ఉత్తీర్ణత సాధించారన్నారు. డమ్మీ మార్కుల జాబితా కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బిఎస్‌ఈ.ఏపీ.జివోవి.ఐఎన్ వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు. మార్కుల రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు, ఈ నెల ఏడవ తేదీలోగా డైట్‌లో కార్యాలయంలో ఫీజు చలానాతో పాటు తమ దరఖాస్తులను సమర్పించాలన్నారు. డమ్మీ మార్క్స్ మెమోకాపీ, స్వీయ చిరునామాతో కూడిన ఎన్వలప్ కవర్‌ను తప్పనిసరిగా దరఖాస్తుకు జత చేయాలన్నారు. మార్కుల రీకౌంటింగ్‌కు ఫీజు రూ.500 చలానాను ఏపీ,సీఎఫ్‌ఎంఎస్ సిస్టమ్ ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. డిమాండ్‌డ్రాఫ్ట్‌లు అంగీకరించబోమని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment