● జీజీహెచ్‌లో ఉత్తుత్తి పోస్టుల నియామకాల ఫలితం
● లబోదిబోమంటున్న ఉద్యోగులు
కాకినాడ క్రైం: శాంక్షన్డ్ పోస్టుల అవినీతి పాపం పండుతోంది. నర్సింగ్ పోస్టులు అమ్ముకున్న నేరంలో తాజాగా సస్పెండైన మాజీ జీజీహెచ్ మేనేజర్ నరసింగరావు మెడపై శాంక్షన్డ్ పోస్టుల కత్తి వేలాడుతోంది. లేని ఉద్యోగాలను సృష్టించి, అమ్మేసిన అతడి నిర్వాకానికి, అతడిని నమ్మి డబ్బు ముట్టజెప్పి ఉద్యోగాలు పొందిన కొందరి స్వయం కృతాపరాధానికి వందల మంది ఉద్యోగులు లబోదిబోమంటున్నారు. 2021 రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఉన్న పోస్టుల కంటే అదనంగా లేని ఉద్యోగాలు సృష్టించి, నిరుద్యోగులకు కట్టబెట్టిన ఆరోపణలపై గత నెల 23న శ్రీపోస్టులే లేవు.. భర్తీ చేసేశారుశ్రీ శీర్షికన శ్రీసాక్షిశ్రీలో కథనం ప్రచురితమైంది. దీంతో ఉత్తుత్తి పోస్టుల అవినీతి బాగోతం బట్టబయలైంది. కలెక్టర్ నేరుగా ఈ అవినీతిపై దృష్టి సారించారు. డిప్యూటీ కలెక్టర్ శ్రీధర్ బృందాన్ని విచారణకు ఆదేశించారు. లేని పోస్టులు సృష్టించడం, వాటిని అమ్ముకోవడం నిజమేనని ఈ కమిటీ ప్రాథమిక నిర్థారణకు వచ్చింది. ఇదే విషయాన్ని డ్రాయింగ్ అఽథారిటీకి నివేదించడంతో జీతాల నిలుపుదల అనివార్యమైంది. దీంతో అవుట్‌సోర్సింగ్ విధానంలో పని చేస్తున్న 160 మంది, కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న 30 మంది మొత్తం 190 మందిపై ఈ ప్రభావం పడింది. వీరెవరికీ గత నెల జీతాలు అందలేదు. ఈ నెల ఒకటిన జమకావలసి ఉన్నా, నేటికి పది రోజులు గడుస్తున్నా ఇప్పటికీ జమ కాలేదు. ఈ 190 మందిలో ఉత్తుత్తి ఉద్యోగాలను మేనేజర్ నరసింగరావు నుంచి కొనుక్కున్నది ఎవరు, కొనసాగుతున్నది ఎవరనే విషయాలు తేలే వరకూ జీతాల చెల్లింపులు జరిగే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment