బాబోయ్! మళ్లీ పులి
ఫ గిత్త దూడపై దాడి చేసి హతమార్చిన వైనం
ఫ సంఘటన స్థలాన్ని పరిశీలించిన
అటవీ అధికారులు
ఫ పాదముద్రల ఆధారంగా పులిగా నిర్ధారణ
ఫ ఆందోళన చెందుతున్న గిరిజనులు
ప్రత్తిపాడు రూరల్: ప్రత్తిపాడు, పరిసర ప్రాంతాల్లో రెండేళ్ల క్రితం పెద్దపులి సంచరించి స్థానిక ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రస్తుతం అది మరచిపోయి అందరూ ప్రశాంతంగా ఉన్న తరుణంలో.. మరోసారి స్థానికంగా పులి భయం మొదలైంది. మండలంలోని బురదకోట పంచాయతీ బాపన్నధార లొద్దులోని ఉలిగోగుల రిజర్వు ఫారెస్టులో పులి హల్‌చల్ చేసింది. గిత్త దూడపై దాడి చేసి హతమార్చింది. బాపన్నధార గ్రామానికి చెందిన రైతు ముర్ల వెంకట్రావు పశువులు ఎప్పటిలానే బాపన్నధార లొద్దులోకి గత శనివారం మేతకు వెళ్లాయి. ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో అతడి మందలోని కొన్ని పశువులు భయాందోళనతో అరుచుకుంటూ ఇంటికి వచ్చాయి. దీంతో అనుమానం వచ్చిన రైతు సంఘటన స్థలానికి వెళ్లగా.. అక్కడ గుర్తు తెలియని జంతువు దాడిలో మృతి చెందిన తన లేగదూడను గుర్తించాడు. దీనిపై అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు గిత్త దూడ మృతదేహాన్ని పరిశీలించి, గుర్తు తెలియని జంతువు పాదముద్రలను సేకరించారు. సంఘటన స్థలంలో అప్పట్లో నాలుగు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఆ ట్రాప్ కెమెరాలకు సోమవారం వరకూ ఎటువంటి ఆచూకీ లభించలేదు. గిత్తదూడ మృతదేహానికి ప్రత్తిపాడు ప్రాంతీయ పశు వైద్యశాల అసిస్టెంట్ డైరెక్టర్ యోగేశ్వర్ పర్యవేక్షణలో పంచనామా నిర్వహించి ఖననం చేశారు.
అది పులే..
గిత్త దూడపై దాడి చేసి, హతమార్చిన తీరు, సంఘటన స్థలంలో లభించిన పాదముద్రల ఆధారంగా ఆ గుర్తు తెలియని జంతువు పులేనని అధికారులు నిర్ధారించారు. అడ్డతీగల మండలం గొంతీదేవి వాగులో ఇటీవల చిరుతపులి సంచరించినట్లు వార్తలు వచ్చాయి. అక్కడి నుంచి చిరుత ఈ ప్రాంతానికి వచ్చిందనే అనుమానం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. అయితే, పాదముద్రల ఆధారంగా పెద్ద పులే దూడపై దాడి చేసినట్లు అధికారులు నిర్ధారించారు.
ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
పులి సంచారం నేపథ్యంలో నియోజకవర్గంలోని ధారపల్లి, కొండపల్లి, బాపన్నధార, బురదకోట, వంతాడ, లింగంపర్తి, భద్రవరం, సిరిపురం, పేరవరం, కొండతిమ్మాపురం, పొదురుపాక, పాండవులపాలెం, తాడువాయి, పెద్దమల్లాపురం, వేళంగి, అనుమర్తి, ఆవెల్తి, ఒండ్రేగుల గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. అత్యవరసర పనులు ఉంటే తప్ప రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దని హెచ్చరించారు. పొలాల్లో మకాల వద్ద పశువులను, మేకలను, గొర్రెలను ఉంచరాదని సూచించారు.
గిరిపుత్రుల్లో గుబులు
బాపన్నధార వద్ద పులి దాడిలో గిత్త దూడ మృతి చెందడంతో స్థానిక గిరిజనుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అడుగు తీసి బయటకు పెట్టలేని పరిస్థితి స్థానికంగా నెలకొంది. అడవీలోకి వెళ్లి అటవీ ఉత్పత్తులు తెచ్చుకుంటేనే కానీ పూట గడవని గిరిజనులు పులి సంచరిస్తోందనే ప్రచారంతో ఇల్లు విడిచి బయటకు రాలేకపోతున్నారు. పులి ఆచూకీ వెంటనే గుర్తించి తమకు రక్షణ కల్పించాలని అటవీ అధికారులను కోరుతున్నారు.
09జేపీటీ144:
సంఘటన స్థలంలో ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలు
Comments
Please login to add a commentAdd a comment