గాలికొదిలేసిన కూటమి హామీలే అజెండా
ఫ నేడు వైఎస్సార్ సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా సమావేశం
ఫ ముఖ్య అతిథిగా పాల్గొంటున్న రీజినల్
కో ఆర్డినేటర్ బొత్స
సాక్షి ప్రతినిధి, కాకినాడ: వైఎస్సార్ సీపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా విస్తృత స్థాయి సమావేశం కాకినాడలో మంగళవారం జరగనుంది. స్థానిక సూర్య కళా మందిరంలో ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశంలో పార్టీ ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు సోమవారం ఈ వివరాలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం జరుగుతున్న పార్టీ తొలి సమావేశంలో భవిష్యత్ కార్యచరణపై చర్చించనున్నామని చెప్పారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా ప్రజల తరఫున నిర్వహించే పోరాటాలపై ఈ సమావేశంలో చర్చించనున్నామని తెలిపారు. ఈ నెల 13న రైతు సమస్యలపై కలెక్టరేట్ల వద్ద నిరసన, 27న విద్యుత్ చార్జీల పెంపుపై ఎస్‌ఈ కార్యాలయాల వద్ద, జనవరి 3న ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట తప్పిన కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనలపై ఈ సమావేశంలో చర్చించనున్నామని వివరించారు. వీటితో పాటు సార్వత్రిక ఎన్నికల్లో ఎడాపెడా ఊదరగొట్టి, గాలికొదిలేసిన సూపర్‌సిక్స్ హామీలు, భావప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ అడ్డగోలుగా సోషల్ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం సాగిస్తున్న దమనకాండ, పార్టీ కమిటీల నియామకాలపై కూడా చర్చించనున్నారని తెలిపారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పార్టీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ముఖ్య నేతలు, అనుబంధ సంఘాల నాయకులు హాజరు కావాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment