‘దేవదాయ, ధర్మాదాయ శాఖను రద్దు చేయాలి’
అభయసేన అధ్యక్షుడు స్వామి
రాధామనోహర్‌దాస్
కరప: గుడులను, గుడుల్లో లింగాలను మింగేస్తున్న రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖను రద్దు చేయడమే శ్రేయస్కరమని హిందూ అభయసేన అధ్యక్షుడు స్వామి రాధామనోహర్‌దాస్ అన్నారు. ఈ శాఖను రాక్షస శాఖ, ధర్మనాశన శాఖగా అభివర్ణించారు. దేవాలయాల నిర్వహణ హిందువులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కరప మండలం అరట్లకట్ట గ్రామంలో ఆదివారం రాత్రి జరిగిన హిందూ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యాన వచ్చే నెల 5న విజయవాడలో జరిగే హైందవ శంఖారావ సభను విజయవంతం చేసేందుకు ప్రతి హిందువూ తరలిరావాలని పిలుపునిచ్చారు. హిందువులను కులాల వారీగా విడగొట్టే రాజకీయాలు మానుకోవాలన్నారు. గడప లోపలే కులాన్ని ఉంచుకోవాలని, గడప దాటితే హిందువని గర్జించాలని సూచించారు. హైందవ జాతి సంఖ్య తగ్గిన చోటనే హిందువులపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయని, ఇందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్, మన దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఉదాహరణగా నిలుస్తాయని వివరించారు. అక్కడ కులం పేరు చూసి కాకుండా హిందువు అంటే చంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ ఎడారి మతాలకు దూరంగా ఉండి, విజయవాడ సభకు తరలివచ్చి హిందువులు ఇంకా బతికే ఉన్నారని చాటిచెప్పాలని రాధామనోహర్‌దాస్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు వెలుగుబంట్ల శ్రీనివాస్, యరమాటి సతీష్, బ్రహ్మాజీ, కె.పెద్ద అప్పాజీ, సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మప్రచారక్ పడాల రఘు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
విద్యార్థి దశలో లక్ష్య సాధనకు కృషి చేయాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): విద్యార్థి దశలో లక్ష్యాలు ఏర్పరచుకుని, వాటి సాధనకు కృషి చేయాలని జేఎన్‌టీయూకే ఇన్‌చార్జ్ ఉప కులపతి ఆచార్య మురళీకృష్ణ అన్నారు. జేఎన్‌టీయూకే సీఎస్‌ఈ విభాగం ఆధ్వర్యాన వారం రోజుల పాటు నిర్వహించే జనరేషన్ ఏఐ ఫర్ డేటా అనలిటిక్స్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ధూమపానం, మద్యపానం, డ్రగ్స్‌కు విద్యార్థులు దూరంగా ఉండాలని, అప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. సరికొత్త ఆలోచనలు, స్నేహితులతో చర్చించుకోవడం ద్వారా ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు. ప్రపంచ మార్కెట్ భారత్ వైపు చూస్తోందని, దానిని అందిపుచ్చుకునేందుకు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని సూచించారు. ఇన్‌చార్జ్ రిజిస్ట్రార్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ, ఇటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను రూపొందించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ రామకృష్ణయ్య, సీఎస్‌ఈ విభాగాధిపతి ఎన్.రామకృష్ణయ్య, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉషాదేవి, ఎస్.సురేఖ పాల్గొన్నారు.
పింఛన్ల సర్వే
92 శాతం పూర్తి
తుని రూరల్: పింఛన్ల లబ్ధిదారుల అర్హతలను గుర్తించేందుకు జిల్లాలోని తుని మండలం రేఖవానిపాలెంలో సోమవారం ప్రయోగాత్మకంగా నిర్వహించిన సర్వే 92 శాతం పూర్తయ్యింది. డీఎల్‌డీఓ కేఎన్‌వీ ప్రసాదరావు పర్యవేక్షణలో ఇతర మండలాలకు చెందిన 11 మంది గెజిటెట్ అధికారులు, మరో 11 మంది సచివాలయ సిబ్బంది ఈ సర్వే నిర్వహించారు. ఒక్కో బృందానికి 40 మంది పింఛన్‌దార్లను కేటాయించారు. పంచాయతీ పరిధిలోని రేఖవానిపాలెం, మరువాడ గ్రామాల్లో వృద్ధాప్య పింఛన్లు 212, వితంతు పింఛన్లు 120, ఒంటరి మహిళలు 8, అభయ హస్తం 5, చేనేత 1, కుష్ఠు వ్యాధిగ్రస్తులు ఒకరు చొప్పున మొత్తం 433 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో 399 మందికి సంబంధించి సర్వే పూర్తయ్యిందని డీఎల్‌డీఓ ప్రసాదరావు తెలిపారు. మరో 34 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో సర్వే జరగలేదన్నారు. కలెక్టర్ ఆదేశించిన తర్వాత ఈ 34 మందిపై సర్వే నిర్వహిస్తామన్నారు. సర్వేలో భాగంగా ఆయా లబ్ధిదారుల బయోమెట్రిక్‌తో ట్యాబ్‌లో ఆన్‌లైన్ అప్లికేషన్‌లోని పది ప్రశ్నలు పూర్తి చేశామని చెప్పారు. ఆయా వర్గాలకు సంబంధించి వివిధ సర్టిఫికెట్లను పరిశీలించి, అవసరమైన నకళ్లను సర్వే బృందాలు సేకరించాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment