ఎన్నాళ్లో.. నిరీక్షణ!
కాకినాడ రూరల్: పండగలు, సెలవు రోజుల్లో వేలాదిగా, నిత్యం వందలాదిగా జనం కాకినాడ బీచ్‌కు వస్తూంటారు. వారిని ఆకర్షించేందుకు పది నెలల కిందట ఇక్కడ ప్రారంభించిన యుద్ధ విమాన మ్యూజియాన్ని సందర్శనకు కాకినాడ నగరాభివృద్ధి సంస్థ (కౌడా) అధికారులు ఎప్పుడు అనుమతిస్తారా అని పలువురు ఎదురు చూస్తున్నారు.
జిల్లా కేంద్రమైన కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట గ్రామంలోని న్యూ ఎన్టీఆర్ బీచ్‌లో టీయూ–142ఎం యుద్ధ విమానంతో ఈ మ్యూజియం ఏర్పాటు చేశారు. వినోదంతో పాటు త్రివిధ దళాల్లో చేరే యువతకు స్ఫూర్తిని పంచే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషితో కేంద్రం ఈ యుద్ధ విమానాన్ని మన రాష్ట్రానికి కేటాయించింది. విశాఖ బీచ్‌లో మాదిరిగా కాకినాడ బీచ్‌లో కూడా అప్పటి గోదావరి నగరాభివృద్ధి సంస్థ(గుడా) ఆధ్వర్యాన సూర్యారావుపేట బీచ్‌లో రూ.9.03 కోట్లతో థీమ్ పార్కు నిర్మించారు. ఇందులో 53 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 12 మీటర్ల ఎత్తుతో 150 టన్నుల బరువు కలిగిన యుద్ధ విమానాన్ని ఏర్పాటు చేశారు. దీనిని విడిభాగాలుగా తమిళనాడు నుంచి వాహనాల్లో తీసుకువచ్చి, బీచ్‌లో మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు రూ.6 కోట్ల వరకూ ఖర్చు చేశారు. బీచ్ పార్కు అభివృద్ధి, రోడ్లు, ముఖద్వారం, గార్డెన్, లైటింగ్, గ్రీనరీ వంటి వాటికి మిగిలిన సొమ్ము కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి, అప్పటి స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కౌడా చైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి నిరంతర పర్యవేక్షణతో ఈ పనులు పూర్తి చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 26న యుద్ధ విమాన మ్యూజియాన్ని అప్పటి కాకినాడ రూరల్, సిటీ ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ఎంపీ వంగా గీత, తూర్పు నావికాదళ కమాండెంట్ ఎన్.సుదీప్ తదితరులు ప్రారంభించారు. ఈ మ్యూజియం ప్రారంభోత్సవం పూర్తయి దాదాపు 10 నెలలు గడుస్తున్నా సందర్శకులను మాత్రం ఇప్పటికీ అనుమతించడం లేదు. ఇక్కడ పిల్లలకు ఆహ్లాదాన్ని పంచే క్రీడా పరికరాలతో పాటు సందర్శకులకు టాయ్‌లెట్లు, డ్రెస్ చేజింగ్ రూముల వంటి పనులు చేయాల్సి ఉంది. వీటిని త్వరితగతిన పూర్తి చేసి, క్రిస్మస్, సంక్రాంతి పర్వదినాలనాటికి అందుబాటులోకి తీసుకుని రావాలని అధికారులు భావిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. కౌడా వైస్ చైర్‌పర్సన్‌గా ఉన్న కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన ఇటీవల బీచ్ పార్కును సందర్శించి, అసంపూర్తిగా ఉన్న పనులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆమె సూచనల మేరకు ప్రస్తుతం పనులు వేగవంగమయ్యాయి. పనులు త్వరిగతిన పూర్తి చేసి, కొత్త సంవత్సరం, సంక్రాంతి పండగలకు వచ్చే సందర్శకులకు యుద్ధ విమాన మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకుని రావాలని పలువురు కోరుతున్నారు.
ఫ కాకినాడ బీచ్‌లో రూ.9.03 కోట్లతో
యుద్ధ విమాన మ్యూజియం ఏర్పాటు
ఫ గత సీఎం జగన్ ప్రత్యేక చొరవతో
యుద్ధ విమానం కేటాయింపు
ఫ యువతకు స్ఫూర్తినిచ్చేలా
పార్కు నిర్మాణం
ఫ ప్రారంభించి నెలలు గడుస్తున్నా
సందర్శకులకు నో ఎంట్రీ
Comments
Please login to add a commentAdd a comment