కాకినాడ సిటీ: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 31వ తేదీ వరకూ ఎస్సీ కులగణనపై సోషల్ ఆడిట్ నిర్వహించి, అభ్యంతరాలు స్వీకరిస్తామని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి శ్రీనివాసరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీ కులగణన వివరాలను గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రదర్శించామని, దీనిపై వచ్చే అభ్యంతరాలను వచ్చే నెల 6 వరకూ క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తారన్నారు. కులగణన తుది వివరాలను వచ్చే నెల 10న సచివాలయాల్లో ప్రదర్శిస్తామని తెలిపారు. కులగణనపై మూడు దశల్లో తనిఖీలుంటాయన్నారు. పేరు, ఆధార్ నంబర్, పుట్టిన తేదీ, వయస్సు, ఉపకులం, మరుగుదొడ్డి, తాగునీటి సౌకర్యాలు, విద్యార్హత, వృత్తి, వ్యవసాయం వివరాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తారని వివరించారు. పౌరుల నుంచి వచ్చిన అభ్యంతరాలను వీఆర్‌ఓ పరిశీలించి, ఆర్‌ఐకి నివేదిస్తారన్నారు. వీటిని ఆర్‌ఐ పునఃపరిశీలించి తహసీల్దార్‌కు రికమండ్ చేస్తారన్నారు. అనంతరం తహసీల్దార్, వీఆర్‌ఓ, ఆర్‌ఐల నివేదికలో వివరాలను పరిశీలించి, తుది ఆమోదం తెలిపి, ఆ వివరాలు భద్రపరుస్తామని తెలిపారు. ఈ వివరాల్లో కచ్చితత్వాన్ని పెంపొందించేందుకు సహాయ సాంఘిక సంక్షేమ అధికారులతో 50 మంది వివరాలను ర్యాండమ్‌గా తనిఖీ చేస్తామని, సోషల్ ఆడిట్‌ను కలెక్టర్, ఆర్‌డీఓలు పర్యవేక్షిస్తారని శ్రీనివాసరావు తెలిపారు.
తత్కాల్ ఫీజుతో
అడ్మిషన్‌కు అవకాశం
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఓపెన్ స్కూల్‌లో తత్కాల్ ఫీజుతో అడ్మిషన్లు పొందేందుకు అవకాశం కల్పించారని ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్ సాయి వెంకట రమణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియెట్ కోర్సుల్లో అడ్మిషన్లు పొందాలనుకునే వారు ఈ నెల 26 నుంచి 31వ తేదీలోపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. అడ్మిషన్ ఫీజుకు అదనంగా తత్కాల్ ఫీజు రూ.600 చెల్లించి అడ్మిషన్ పొందవచ్చన్నారు. ఇతర వివరాలకు సమీపంలోని పాఠశాలల్లో ఉన్న ఓపెన్ స్కూల్ కో ఆర్డినేటర్‌ను సంప్రదించాలని కోరారు.
ఆదాయం పెంపుపై సమీక్ష
అన్నవరం: వీర వేంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై సిబ్బందితో చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.సుబ్బారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులు పలు సూచనలు చేశారు. వ్రత విభాగంలో మిగిలేది చాలా తక్కువని, అందువలన రూ.300 వ్రతం టికెట్టును రూ.500కు పెంచి, అందులో రూ.400పై 40 శాతం కమీషన్ పురోహితులకు, మిగిలిన రూ.వంద దేవస్థానానికి చెందేలా చూడాలన్న సూచన వచ్చింది. దీనివలన దేవస్థానానికి రూ.5.50 కోట్లు మిగులుతుందని అంచనా. అలాగే, వ్రతాల్లో ఉపయోగించే గావంచాలకు ఏటా రూ.60 లక్షల ఖర్చవుతోంది. దీనికి బదులు వ్రతంలో రాగి యంత్రం ఉంచి, అనంతరం దేవస్థానం తీసుకునేలా సూచన చేశారు. వ్రతాల్లో వాడే బియ్యం వేలం వేస్తే కూడా దేవస్థానానికి ఆదాయం వస్తుందనే సూచన వచ్చింది. డిజిటల్ పేమెంట్ల కోసం త్వరలో ఐదుచోట్ల కియోస్క్‌లు పెట్టాలని, వాటి ద్వారా స్కాన్ చేస్తే వ్రతం, దర్శనం, ప్రసాదం టికెట్లు వచ్చేలా చూడాలని సూచన చేశారు. పలుచోట్ల స్కాన్ ద్వారా కానుకలు చెల్లించేలా ఈ–హుండీలు ఏర్పాటు చేయాలని కొంతమంది సూచించారు. ఈ సూచనలన్నీ క్రోడీకరించి నివేదిక తయారు చేయాలని, తరువాత దేవదాయ శాఖ కమిషనర్‌తో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సమీక్షలో నిర్ణయించారు.
ఏపీ ప్రత్యేక రక్షణ దళం
ప్రాంతీయ కార్యాలయం మార్పు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రక్షణ దళం రాజమహేంద్రవరం ప్రాంతీయ కార్యాలయాన్ని స్థానిక నారాయణపురంలోని నాగమ్మతల్లి గుడి వెనుక వైపునకు మార్చారు. దీనిని కమాండెంట్ కొండా నరసింహారావు, సహాయ కమాండెంట్ పీవీఎస్‌ఏడీ ప్రసాదరావు, డి.గంగరాజు, అధికారులు, సిబ్బంది గురువారం ప్రారంభించారు. కమాండెంట్ నరసింహరావు దంపతులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, సర్వమత ప్రార్థనలు చేశారు.
నేడు ఏలూరుకు
ఏకసభ్య కమిషన్ రాక
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎస్సీ ఉప వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ శుక్రవారం ఏలూరు జిల్లాలో పర్యటించనుంది. జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి ఎంఎస్ శోభారాణి గురువారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా జిల్లా యంత్రాంగం, వివిధ ఉప కులాల సభ్యులు, సంఘాలతో సమావేశమై వినతులు స్వీకరిస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment