పీజీఆర్‌ఎస్‌కు 370 అర్జీలు
కాకినాడ సిటీ: ప్రతివారం ప్రజల నుంచి అందుతున్న వినతులకు అధిక ప్రాధాన్యమిచ్చి సానుకూల దృక్పథంతో పరిష్కరించాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. ప్రజాసమస్యల పరిష్కార నిమిత్తం సోమవారం కాకినాడ కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్‌మీనా, డీఆర్వో జె వెంకటరావు, హౌసింగ్ పీడీ ఎన్‌వీవీ సత్యనారాయణ, జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు, కేఎస్‌ఈజెడ్ ఎస్‌డీసీ కెవీ రామలక్ష్మి, సీపీవో పి.త్రినాథ్‌లతో కలిసి హాజరై జిల్లా నలుమూలల నుంచి ప్రజల నుంచి వచ్చిన 370 అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెవెన్యూ, పింఛన్లు, బియ్యంకార్డు మంజూరు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, టిడ్కో గృహాలు, ఇళ్ల స్థలాలు, భూమి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు, ఆక్రమణల తొలగింపు, డ్రైన్, కాలువల్లో పూడిక తొలగింపు, పారిశుధ్యం, సదరం సర్టిఫికెట్ మంజూరు వంటి అంశాలకు సంబంధించి అర్జీలు ప్రజల నుంచి అధికారులకు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ విభాగాల అధిపతులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడి
ఎన్నికకు నామినేషన్ల స్వీకరణ
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): బీజేపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సోమవారం కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవికి నామినేషన్లు స్వీకరించారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, పార్టీ జిల్లా రిటర్నింగ్ అధికారి కోడూరు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో స్థానిక బోట్‌క్లబ్ వద్ద నున్న చోడే అప్పారావు ప్రకృతి చికిత్సాలయంలో నామినేషన్లు స్వీకరించారు. బిక్కిన విశ్వేశ్వరరావు, రంభాల వేంకటేశ్వరరావు, మట్టా మంగరాజు, గండి కొండలరావులు నామినేషన్లు దాఖలు చేశారు.
ఇబ్బంది పెడుతున్న వ్యక్తిపై
చర్యకు డిమాండ్
కాకినాడ సిటీ: దళితులమైన తమను కక్ష పూరితంగా ఇబ్బందులకు గురి చేస్తున్న పుల్ల గోవిందుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామానికి చెందిన మాదే లక్ష్మీ, మాదే చంద్రరావు, మాదే నవీన్ జ్యోత, రాఘవకుమార్ సోమవారం జేసీ రాహుల్ మీనాను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు విలేకర్లతో మాట్లాడారు. దళితులు నివాసం ఉంటున్న స్థలాన్ని అగ్రవర్ణానికి చెందిన పుల్ల గోవింద్ పదేళ్లుగా కాజేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. గోవిందు దౌర్జన్యానికి తాము లొంగకపోవడంతో తమపై అమానుషంగా కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల రాత్రి సమయంలో తన అనుచరులతో ఇంటి బాత్రూంను కూల్చివేశారని, తమ స్థలంలో గోడ కట్టి మా ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నాడని, కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని వివరించారు. తాము ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు పరిశీలించి గోవింద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment