దుర్వాసనకు చెక్
వాకలపూడిలోని యూనివర్సల్ బయో ఫ్యూయెల్స్ ఉత్పత్తి నిలుపుదలకు ఆదేశం
కాకినాడ రూరల్: వాకలపూడిలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ పార్కులోని యూనివర్సల్ బయో ఫ్యూయెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై కాలుష్య నియంత్రణ మండలి అధికారులు కొరడా ఝుళిపించారు. పరిశ్రమలోని ఉత్పత్తులను నిలిపివేసేందుకు గాను ‘స్టాఫ్ ప్రొడక్షన్ ఆర్డర్’ ఆదివారం జారీ చేస్తూ విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబరు సెక్రటరీ ఎస్.శ్రీ శరవణన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆదేశాలు తక్షణం అమలులోకి వస్తాయని, వీటిని ఉల్లంఘించి పరిశ్రమలో ఉత్పత్తి నిర్వహిస్తే ప్రొసిక్యూషన్‌కు బాధ్యులవుతారని హెచ్చరించారు. వాకలపూడి పారిశ్రామికవాడలో యూనివర్సల్ బయో ఫ్యూయెల్స్ పరిశ్రమ నుంచి గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో భరించలేనంత దుర్వాసన వెలువడింది. దీని ప్రభావంతో వాకలపూడితో పాటు వలసపాకల, తిమ్మాపురం, సూర్యారావుపేట, రమణయ్యపేట గ్రామాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. కొన్ని సార్లు అర్బన్ పరిధిలోని గుడారిగుంట వరకు దుర్వాసన వెదజల్లింది. ఆయా ప్రాంతాల ప్రజలతో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌కు గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేశారు. అధికారుల బృందం డిసెంబర్ 20, 21 తేదీల్లో పరిశ్రమలను తనిఖీ చేసింది. బయోడీజిల్ ప్లాంట్‌ను యాజమాన్యం నిర్వహిస్తున్నట్టు, అనుమతి లేని ముడిపదార్థాలు జంతు టాలో ఆయిల్, యాసిడ్ ఆయిల్ వినియోగిస్తున్నట్టు తనిఖీలో గుర్తించారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ నుంచి క్రూడ్ యానిమల్ టాలో ఆయిల్ దిగుమతి చేసుకోవడంతో పాటు పరిశ్రమలోని ట్యాంకుల్లో సుమారు 4,535 టన్నుల నిల్వను గుర్తించారు. పరిశ్రమ గాల్లోకి కలుస్తున్న వాయువుల్లో ఎక్కువగా కీటోన్స్, అమైన్‌లు దుర్వాసనకు కారణంగా గుర్తించారు. బయో డీజిల్ తయారీ కార్యకలాపాలల్లో సమ్మతించని ముడి పదార్డాలు వినియోగం నిలిపివేయాలని డిసెంబర్ 21న పరిశ్రమకు నోటీసు జారీ చేశారు. ప్రత్యుత్తరంగా యాజమాన్యం యాసిడ్ ఆయిల్‌ను వినియోగించడం మానివేస్తామని తెలియజేసింది. డిసెంబర్ 31న ఏపీ పొల్యూషన్ బోర్డు మానిటరింగ్ టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో యూనివర్సల్ బయో డీజిల్ పరిశ్రమపై చర్చ జరిగింది. పరిశ్రమ తరఫున ప్రతినిధులు స్వయంగా పాల్గొనగా ఈఈ, ఆర్‌ఓ కాకినాడ వీడియో కాన్పరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఉత్పత్తి నిలుపుదలకు కమిటీ సిఫార్సు చేసింది. దీనిపై ఆదివారం పూర్తి స్థాయిలో ఆదేశాలు వచ్చాయని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శంకరరావు తెలిపారు. 2018లో ఇదే పరిశ్రమ నుంచి దుర్వాసన రావడంతో 2018 మార్చి 3న స్టాఫ్ ప్రొడక్షన్ ఆర్డర్ జారీ అయ్యిందని, అదే ఏడాది మార్చి 22న ఆరు నెలల కాలానికి మూసివేత ఉత్తర్వులను తాత్కలికంగా రద్దు చేసి, తరువాత పొడిగించిందన్నారు. 2019మే 3న పరిశ్రమ ఉత్పత్తిని నిలిపివేసే ఆర్డర్‌ను శాశ్వతంగా రద్దు చేసిందన్నారు. తాజాగా స్టాఫ్ ప్రొడక్షన్ ఆర్డర్ రావడంతో తదనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్టు ఈఈ శంకరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment