డ్రైవింగ్‌లో బాధ్యతగా ఉండాలి
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ప్రతి ఒక్కరూ వాహనాల డ్రైవింగ్ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా రవాణా అధికారి కె.శ్రీధర్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రహదారి భద్రత ప్రచారం – శ్రద్ధ వహించండి అనే అంశంపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ, మద్యం తాగి వాహనాలు నడపరాదని, రహదారి నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని అన్నారు. నెల రోజుల పాటు నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ప్రతి రోజూ ఒక అంశంపై అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్‌టీఓ జీవీ శివారెడ్డి, మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పథకాలపై
అవగాహన కల్పించాలి
కాకినాడ సిటీ: కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించి, మరింత మందికి లబ్ధి చేకూర్చేందుకు అధికారులు కృషి చేయాలని స్థానిక ఎంపీ, జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన దిశ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. కలెక్టర్, దిశ మెంబర్ సెక్రటరీ షణ్మోహన్ మాట్లాడుతూ, పీఎంఈజీపీ, పీఎంఎంవై, ముద్రా వంటి పథకాలు, జాతీయ ఆరోగ్య పథకం, జననీ సురక్ష యోజన, ప్రధాన మంత్రి మాతృత్వ వందన, సార్వత్రిక ఆరోగ్య పరీక్షలు, రాష్ట్రీయ బాల స్వాస్థ్య, రక్తహీనత నిర్మూలన తదితర వివిధ పథకాల గురించి వివరించారు. సమావేశంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ భావన, జెడ్పీ సీఈఓ వీవీవీఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
అందరూ ఆధ్యాత్మికతను
అలవరచుకోవాలి
పిఠాపురం: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని మైసూరు దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ అన్నారు. స్థానిక శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్త క్షేత్ర వార్షికోత్సవాల్లో పాల్గొన్న ఆయన మంగళవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పాదగయ రాగసాగర కచేరీలో భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. ఆధ్యాత్మికతత్వంతో ప్రతి ఒక్కరికీ మానసిక ప్రశాంతత చేకూరుతుందని చెప్పారు. ఆధ్యాత్మిక జీవన విధానం ప్రతి మనిషికీ ఎంతో అవసరమన్నారు. క్షేత్రంలో వేంచేసిన శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారికి మైసూరు దత్త పీఠం ఉత్తరాధికారి దత్త విజయానంద తీర్థ స్వామీజీ ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. అనఘా దత్త క్షేత్రంలో గురువారం వరకూ వార్షికోత్సవాలు నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment