![వైభవంగా శివరాత్రి ఉత్సవాలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ptp45-270041_mr-1738866879-0.jpg.webp?itok=Ke0X7Jh4)
వైభవంగా శివరాత్రి ఉత్సవాలు
● భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు
● సమీక్షలో అసిస్టెంట్ కలెక్టర్ సూచన
సామర్లకోట: స్థానిక పంచారామ క్షేత్రమైన కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో అత్యంత వైభవంగా నిర్వహించాలని అసిస్టెంట్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన సూచించారు. వివిధ శాఖల అధికారులతో పంచారామ క్షేత్రంలో గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులందరికీ దర్శనాలు సక్రమంగా జరిగేలా చూడాలన్నారు. పారిశుధ్యం, లైటింగ్ ఏర్పాట్లను మున్సిపాలిటీ చూస్తుందని చెప్పారు. తాగునీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసు బందోబస్తుకు అదనపు సిబ్బందిని తీసుకుంటామని సీఐ కృష్ణభగవాన్ చెప్పారు. భక్తులకు సేవలు చేసే స్వచ్ఛంద సంస్థల సభ్యులు, ఎన్‌సీసీ విద్యార్థుల పేర్లు ముందుగా తీసుకోవాలని సూచించారు. ఆలయ ఈఓ బళ్ల నీలకంఠం మాట్లాడుతూ, పంచారామ క్షేత్రంలో ఈ నెల 24 నుంచి మార్చి 1వ తేదీ వరకూ మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపారు. గోదావరి కాలువ కొత్త బ్రిడ్జిపై ఉన్న మట్టిపై తరచూ వాటరింగ్ చేయించాలని మున్సిపల్ అధికారులను కోరారు. ఉత్సవ కమిటీ చైర్మన్ కంటే బాబు మాట్లాడుతూ, భక్తులు పుణ్యస్నానాలు చేసే గోదావరి కాలువలోకి కలుషిత జలాలు రాకుండా అధికారులు శ్రద్ధ చూపాలని కోరారు. మాండవ్య నారాయణస్వామి కాలి బాట వంతెన ఎదురుగా ఫ్లైఓవర్ బ్రిడ్జి దిగువన ఖాళీ స్థలంలో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారి ఫణిత మాట్లాడుతూ, కాలువలోకి కలుషిత జలాలు రాకుండా పరిసరాల్లోని పరిశ్రమలకు నోటీసులు ఇచ్చామని చెప్పారు. మున్సిపాలిటీ నుంచి అవసరమైన అన్ని సేవలూ అందిస్తామని మున్సిపల్ కమిషనర్ ఎ.శ్రీవిద్య హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment