![కూటమి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06kkd03a-600224_mr-1738866877-0.jpg.webp?itok=keCmbvuv)
కూటమికి విమానం మోత
● విమానాశ్రయంపై తలొక ప్రతిపాదన
● నేతల మధ్య ఆధిపత్య పోరు
● అన్నవరం ఎయిర్‌పోర్టు సాధ్యం కాదన్న ఏఏఐ
● సాల్ట్ భూములపై తాజా ప్రతిపాదన
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ‘ఎగిరిపోతే ఎంత బాగుంటుందో’ అంటూ పల్లవి అందుకుంటున్నారు కూటమి నేతలు. గాలిలో మేడలు కట్టడం, లాండ్ అవ్వని విమానాలను.. వచ్చేస్తున్నట్టు బిల్డప్‌లు ఇవ్వడం చంద్రబాబు సర్కార్‌కు కొత్తేమీ కాదు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది. రాష్ట్రంలో ఆరు ఎయిర్‌పోర్టులు ఏర్పాటు చేస్తున్నట్టు కూటమి ప్రభుత్వం రెండు నెలల క్రితం ఆర్భాటంగా ప్రకటించింది. అందులో ఒకటి కాకినాడ జిల్లాకు ఇస్తున్నట్టు చెప్పుకొచ్చింది. కోల్‌కతా – చైన్నె జాతీయ రహదారికి సమీపాన అన్నవరం – బెండపూడి మధ్య ఈ విమానాశ్రయం ఏర్పాటుకు ప్రతిపాదించారు. దీనికి సుమారు 757 ఎకరాలు అవసరమని ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రాథమికంగా నిర్ధారించింది. తొండంగి మండలం బెండపూడి, పీఈ చిన్నాయిపాలెం గ్రామాల పరిధిలో భూ సేకరణకు ప్రతిపాదించారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటు, భూ సేకరణ సాధ్యాసాధ్యాలపై ఇటీవలే ఏఏఐ అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించింది. దీని ప్రకారం ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు ఈ ప్రాంతంలో అంతగా సానుకూలత లేదని ఏఏఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయాన్ని జిల్లా అధికారులు కూడా ప్రైవేటు సంభాషణల్లో ప్రస్తావించారు.
ఇవీ ప్రతికూలతలు
ప్రతిపాదిత అన్నవరం ఎయిర్‌పోర్టుకు సేకరించే భూములకు రూ.కోట్లలో పరిహారం చెల్లించాల్సి ఉంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేఎస్‌ఈజెడ్) పరిధిలో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన దివీస్, ఇటీవలే ఉత్పత్తి ప్రారంభమైన లీఫియస్‌తో పాటు, భవిష్యత్‌లో ఏర్పాటవుతాయని చెబుతున్న ఫార్మా కంపెనీల నుంచి వచ్చే ఎయిర్ కార్గోపై అంచనాలు తప్పాయని ఏఏఐ నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అలాగే, ఒకవైపు 100 కిలోమీటర్లలోపే రాజమహేంద్రవరం, మరోవైపు 150 కిలోమీటర్లలోపు విశాఖపట్నం విమానాశ్రయాలు ఉండటం కూడా ప్రతికూల అంశాలని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. వాస్తవానికి తుని – బెండపూడి మధ్య ఎయిర్‌పోర్టు ఏర్పాటు టీడీపీలో చంద్రబాబు తరువాత అంతటి ప్రాధాన్యం కలిగిన సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడి చిరకాల ఆశ. అక్కడ ఎయిర్‌పోర్టు వస్తే నష్టపోయే 1,200 మందీ కూడా చిన్న రైతులే. అయితే ఈ ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల యనమల అనుచరులు, బంధువులు గతంలో దండిగా భూములు కొన్నారని, అందువల్లనే ఈ విమానాశ్రయం కోసం వారు పట్టుబట్టారని అంటున్నారు.
అందుబాటులో 1,195 ఎకరాలు
అన్నవరం విమానాశ్రయ నిర్మాణానికి ఏఏఐ సానుకూలంగా లేకపోవడంతో కాకినాడ శివారు చొల్లంగి – గురజనాపల్లి మధ్య కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సాల్ట్ కమిషనర్ భూములను తెర మీదకు తీసుకువచ్చారు. కత్తిపూడి – దిగమర్రు హైవేకు ఆనుకుని.. పెనుగుదురులో 566.50, గురజనాపల్లిలో 560.50, చొల్లంగి పరిసరాల్లో 68 కలిపి మొత్తం 1,195 ఎకరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఉప్పు సాగు కోసం ఈ భూములను లీజు ప్రాతిపదికన ఇస్తున్నారు. ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయాలని అప్పటి లోక్‌సభ స్పీకర్ దివంగత జీఎంసీ బాలయోగి మూడు దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. ఈ భూములను అప్పగించే ప్రతిపాదనను అప్పట్లోనే ఆయన సాల్ట్ కమిషనర్ దృష్టికి కూడా తీసుకుని వెళ్లారు. ఎయిర్‌పోర్టు అథారిటీతో పాటు సాల్ట్ కమిషనర్ కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉన్నారు. ఈ క్రమంలో పైసా పరిహారం ఇవ్వనవసరం లేకుండా భూ సేకరణ పూర్తి చేయవచ్చునని కాకినాడ సిటీ, రూరల్ ప్రజాప్రతినిధులు ఒక రోడ్ మ్యాప్ తయారు చేశారు. అయితే, ఎయిర్‌పోర్టుకు భూములు సేకరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. అందువలన సాల్ట్ భూములు కేటాయిస్తే.. దానికి సంబంధించిన సొమ్మును కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంటుంది.
సాల్ట్ భూముల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేస్తే ఇటు కాకినాడ జిల్లాతో పాటు అటు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పరిసర ప్రాంతాలకు కూడా కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే విమాన సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఎయిర్‌పోర్టు ఇటా అటా అనే దానిపై కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. అసలు ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా లేక.. సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడంతో వస్తున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ కుప్పిగంతులాడుతున్నారా అనే చర్చ నడుస్తోంది.
సాల్ట్ కమిషనర్ భూముల్లో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు రూపొందించిన మ్యాప్
![కూటమికి విమానం మోత1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06kkd02-600224_mr-1738866877-1.jpg)
కూటమికి విమానం మోత
![కూటమికి విమానం మోత2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06kkd01a-600224_mr-1738866878-2.jpg)
కూటమికి విమానం మోత
Comments
Please login to add a commentAdd a comment