![గుండెపోటు బాధితులకు ఉచితంగా ఇంజక్షన్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06kkd106-270022_mr-1738866879-0.jpg.webp?itok=CtosQBE0)
గుండెపోటు బాధితులకు ఉచితంగా ఇంజక్షన్
● కలెక్టర్ షణ్మోహన్
● అవగాహన పోస్టర్ ఆవిష్కరణ
కాకినాడ సిటీ: గుండెపోటు బాధితులకు జిల్లాలోని అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర వైద్యం అందుబాటులో ఉందని కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. గుండెపోటు లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను జిల్లా ప్రభుత్వాసుపత్రుల సమన్వయకర్త డాక్టర్ ఎన్.స్వప్నతో కలిసి కలెక్టరేట్‌లో గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, తుని ఏరియా ఆసుపత్రితో పాటు జిల్లాలోని 9 సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో గుండెపోటు బాధితులకు అందించే ఇంజక్షన్ అందుబాటులో ఉందన్నారు. రూ.40 వేల విలువైన ఈ ఇంజక్షన్‌ను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా అందిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ గుండె పోటుకు గురైన 82 మందికి ఈ ఇంజక్షన్ అందించామన్నారు. గుండె నొప్పికి గురయ్యే వారు తొలి గంటలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన వైద్య సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ కోరారు.
జీజీహెచ్ అభివృద్ధికి కృషి చేయాలి
ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి (జీజీహెచ్) అభివృద్ధికి ప్రణాళిక ప్రకారం పని చేయాలని వైద్యాధికారులను కలెక్టర్ షణ్మోహన్ ఆదేశించారు. జీజీహెచ్, ఆరోగ్యశ్రీ, ఇతర విభాగాల అధికారులతో గత నెలలో జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానించిన అంశాల పురోగతిపై కలెక్టరేట్‌లో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్ పి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment