![పరిహారం చెల్లించాకే పనులు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06tun105a-270075_mr-1738866879-0.jpg.webp?itok=luTjT1jA)
పరిహారం చెల్లించాకే పనులు
● పోలవరం కాలువ నిర్వాసితుల డిమాండ్
● రెండో రోజూ పనుల అడ్డగింపు
తుని రూరల్: చట్ట ప్రకారం తమ భూములకు, ఇళ్లకు నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు చేపట్టాలని కుమ్మరిలోవ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఆర్‌వీఆర్ సంస్థ సిబ్బంది రెండో రోజైన గురువారం కాలువ పనులకు ఉపక్రమించగా బాధిత రైతులు, నిర్వాసితులు అడ్డుకున్నారు. జేసీబీ పైకి ఎక్కి ఆందోళన చేశారు. కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సర్వేయర్ జాగారాలు, పోలవరం ఇరిగేషన్ డీఈ మురళి, ఏఈలు సంఘటన స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. తాండవ నది, కంట్రాళ్ల కొండ మీదుగా పోలవరం కాలువ తవ్వి, అక్విడెక్టు నిర్మించేందుకు అడ్డంకిగా ఉన్న కుమ్మరిలోవ కాలనీలో ఇళ్లు, 46.92 ఎకరాల జిరాయితీ భూమి సేకరించాల్సి ఉంది. ఇళ్ల సేకరణ ప్రక్రియ 90 శాతం పూర్తవగా భూసేకరణ సందిగ్ధంలో ఉంది. తుని పట్టణాన్ని ఆనుకుని ఉన్న విలువైన భూములపై తమతో సంప్రదించకుండా అధికారులు రూ.1,87,580 చొప్పున కోర్టులో అవార్డు జమ చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ ఎకరా రూ.3 కోట్లు పైగా పలుకుతోందన్నారు. నిర్వాసితుల కోసం కిలోమీటరు దూరంలో సేకరించిన భూములకు ఎకరాకు రూ.20 లక్షలు పైగా చెల్లించిన అధికారులు.. పట్టణాన్ని ఆనుకుని ఉన్న భూములకు విలువ కట్టడంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. అలాగే, జిరాయితీ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివాసం ఉంటున్న కుటుంబాలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో మరి కొంత మందికి కూడా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ అందాల్సి ఉందన్నారు. తమకు పరిహారం చెల్లించిన తర్వాతే పోలవరం కాలువ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. బాధితుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తామని సర్వేయర్ జాగారాలు, డీఈ మురళి చెప్పారు. జక్కాన రామునాయుడు, జక్కాన రామచంద్రరావు, పోతల రాంబాబు, బాధితులు, నిర్వాసితులు తమ డిమాండ్లను రాతపూర్వంగా సర్వేయర్, డీఈలకు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment