వేసవిలో నీటి సమస్య రాకుండా చూడాలి
కామారెడ్డి క్రైం: వచ్చే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా గ్రామాల్లో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. గత వేసవిలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని వచ్చే వేసవిలో తాగు నీటి సమస్యలు రాకుండా అద్దె బోర్లను పరిశీలించాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగించాలని, మురికి కాల్వల్లోని చెత్తను తొలగించాలని పేర్కొన్నారు. ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయాలన్నారు. నర్సరీల్లోని మొక్కలను వందశాతం సంరక్షించాలన్నారు. డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. రెసిడెన్షియల్ స్కూళ్లు, వసతి గృహాలో్‌ల్ నీటి ఎద్దడి రాకుండా చూడాలని తెలిపారు. మండల ప్రత్యేకాధికారులు క్షేత్ర పర్యటనలో అన్ని అంశాలను పర్యవేక్షించాలని సూచించారు.
ఇందిరమ్మ సర్వేను వేగవంతం చేయాలి
ఇందిరమ్మ ఇళ్ల సర్వేను వేగవంతం చేయాలని, ఇప్పటికే సర్వే చేసిన వివరాల్లో రూఫ్ వివరాలు, గోడల వివరాలు పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల వివరాలను బుధవారంలోగా సమర్పించాలని ఎంపీడీవోలను ఆదేశించారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఇళ్ల సర్వేను త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో రంగనాథ్‌రావు, జెడ్పీ సీఈవో చందర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
కామారెడ్డి క్రైం: ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. ఇందిరా మహిళా శక్తి (ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన) పథకం కింద మంజూరైన సంచార చేపల విక్రయ వాహనాన్ని సోమవారం కలెక్టరేట్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాంధారి మండలంలోని స్వయం సహాయక సంఘ సభ్యురాలు తేజావత్ లతకు ఇందిరా మహిళా శక్తి పథకం కింద రూ. 10 లక్షల విలువ చేసే సంచార చేపల అమ్మకం వాహనం మంజూరయ్యిందన్నారు. ఇందులో రూ. 4 లక్షలు సభ్యురాలు తన వాటాగా చెల్లించగా రూ. 6 లక్షలు సబ్సిడీ కింద మంజూరు చేశామని తెలిపారు. చేపలకోసం మత్స్య శాఖాధికారుల సహకారం పొందాలని, చేపల సరఫరా చేసే వారితో టై అప్ చేసుకోవాలని లతకు సూచించారు. వ్యాపారంలో రాణించి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తానని తేజావాత్ లత పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు వి.విక్టర్, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీపతి, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి మురళీకృష్ణ, గాంధారి మండల సమాఖ్య అధ్యక్షురాలు పుష్పరాణి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment