లక్ష్యం ఘనం.. ఆచరణలో విఫలం
ఎల్లారెడ్డి: మహిళా సంఘాల ఆర్థిక చేయూత కోసం ప్రభుత్వం ఏర్పాటు చేయించిన వ్యవసాయ పరికరాల అద్దె కేంద్రాలు (కస్టమ్ హైరింగ్ సెంటర్లు) నిరుపయోగంగా మారుతున్నాయి. అద్దెకు తీసుకువెళ్లేవారు లేకపోవడంతో ఆయా యంత్ర పరికరాలు మూలకు పడుతున్నాయి. వ్యవసాయంలో యంత్రాల వాడకం పెరగడంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా వ్యవసాయానికి ఉపయోగపడే ట్రాక్టర్లు, నాగళ్లు, రోటవేటర్లు, కల్టివేటర్లు, వరి కోత మిషన్లు, పవర్ స్ప్రేయర్లు, బుష్ కట్టర్లు, డ్రమ్ సీడర్లు, డ్రోన్‌లు ఈ కేంద్రాల్లో అందుబాటు ఉంచారు. ఖరీదైన యంత్రాలను కొనుగోలు చేయలేని రైతులు ఈ కేంద్రాల్లో అద్దెకు తీసుకెళ్తారని భావించింది. బయట మార్కెట్ కంటే తక్కువ అద్దెకు ఇస్తారు. అయితే రైతుల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో ఆయా యంత్రాలు నిరుపయోగంగా మారాయి.
నిర్వహణ లేక పనికిరాని డ్రోన్లు
తక్కువ సమయంలో పొలాల్లో ఎరువులు, సస్యరక్షణ మందులు స్ప్రే చేయడానికి కొనుగోలు చేసిన డ్రోన్లు దాదాపు అన్ని నిర్వహణ లేక మూలన పడ్డాయి. వీటి వాడకం విషయమై మహిళా సంఘాల కుటుంబంలోని యువకులకు శిక్షణ ఇప్పించినా వాటి వాడకం, నిర్వహణలో నైపుణ్యం లేక కొద్ది రోజులకే మూలన పడ్డాయి. ఈ పథకంతో లాభాల కంటే అప్పులే మిగిలాయని పలువురు మహిళలు ఆవేదన చెదుతున్నారు.
అద్దె కేంద్రాల్లో యంత్రాల కొనుగోలుకు బ్యాంకులు, సీ్త్రనిధి ద్వారా రూ.25 లక్షల వరకు మహిళా సంఘాలకు రుణాలను అందజేశారు. ఇందులో సెర్ప్ ద్వారా 25 శాతం సబ్సిడీ ఇచ్చారు. మండలానికి ఒక యూనిట్ చొప్పున ఈ పథకాన్ని అమలు చేశారు. యంత్రాలు, పరికరాలను ఉపయోగించే విషయమై మహిళా సంఘాల సభ్యుల కుటుంబాల్లోని యువకులకు శిక్షణ కూడా ఇచ్చారు. మొదట్లో బాగా నడిచినా యంత్రాల వాడకంలో మహిళా సంఘాల సభ్యులకు సరైన నైపుణ్యం లేక, పనుల్లో నాణ్యత లేకపోవడంతో వాటిని అద్దెకు తీసుకునేవారు కరువయ్యారు. ట్రాక్టర్లు, పరికరాలను ఎవరైన అద్దెకు తీసుకున్నా డబ్బులను పంట వచ్చాక చెల్లిసారు. అద్దె చెల్లించడంలో తీవ్ర జాప్యం చేస్తుండటంతో డీజల్ ఖర్చులకు కూడా డబ్బులు లేక ఆయా పరికరాలు మూలన పడుతున్నాయి. అంతేగాక ఇప్పటికే గ్రామాల్లో చాలా మంది సొంతంగా ట్రాక్టర్లు కొనుగోలు చేశారు. వారికే వ్యవసాయ పనులు దొరక ఇతర పనులకు వెళ్తున్నారు. దీంతో కస్టమ్ హైరింగ్ సెంటర్ల ట్రాక్టర్లకు గిరాకీ రావడం లేదు. ట్రాలీలు కలిగిన ట్రాక్టర్లకు కిరాయిలు దొరుకుతున్నా అవి కూడా పెద్దగా లేవని తెలిసింది. పవర్ స్ప్రేయర్లు, బుష్ కట్లర్లు లాంటి చిన్న పరికరాలు మాత్రం రైతులు అద్దుకు తీసుకెళ్తున్నారు.
మరమ్మతులు కరువు
కస్టమ్ హైరింగ్ సెంటర్లలో ప్రస్తుతం మార్కెట్‌లో అందరు వినియోగించే ట్రాక్టర్లు కాకుండా ఇక్కడ అంతగా వాడకం లేని కుబాటా కంపెనీ ట్రాక్టర్లను జిల్లాలో మహి ళాసంఘాల ద్వారా కొనుగోలు చేయించారు. ఈ ట్రాక్టర్లకు మరమ్మతులు చేసేందుకు సర్వీస్ సెంటర్లు ఎక్కువగా లేకపోవడం, స్పేర్ పార్ట్స్ దొరకక పోవడంతో మూలనపడుతున్నాయి. మొదట్లో జిల్లాలో పలు చోట్ల సర్వీస్ సెంటర్లను ప్రారంభించినా ప్రస్తుతం నిజామాబాద్‌లో మాత్రమే ఈ కంపెనీ సర్వీస్ సెంటర్ పనిచేస్తుంది. అందులో స్పేర్‌పార్ట్స్ కూడా సరిగా ఉండటం లేదని మహిళా సంఘాల సభ్యులు అంటున్నారు.
రుణాలు అందజేసి..
మహిళా సంఘాల ఆర్థిక చేయూత
కోసం అద్దె కేంద్రాల ఏర్పాటు
అద్దెకు తీసుకువెళ్లే వారు లేక
నిరుపయోగంగా మారిన పరికరాలు
నిర్వహణ లేక పాడై పోతున్న యంత్రాలు
Comments
Please login to add a commentAdd a comment