![మహారాష్ట్ర నుంచి కోళ్లు రాకుండా చర్యలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06kmr276-250034_mr-1738872114-0.jpg.webp?itok=KPUSTc1j)
మహారాష్ట్ర నుంచి కోళ్లు రాకుండా చర్యలు
కామారెడ్డి క్రైం : మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రబలిన నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి జిల్లాలోకి కోళ్ల రవాణా జరగకుండా సరిహద్దు చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని కోళ్ళ పెంపకం దారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోళ్లలో వచ్చే వివిధ రకాల వ్యాధులపై గురువారం కలెక్టరేట్‌లో కోళ్ల పెంపకందారులు, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పౌల్ట్రీ రైతులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ.. కోళ్లకు వ్యాధి సోకక ముందే ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలని, వ్యాక్సినేషన్, ఇమ్యునేజేషన్ బూస్టర్‌లు వాడాలన్నారు. చనిపోయిన కోళ్లను దూరంగా పారవేయాలని(ప్రాపర్ డిస్పోజల్) సూచించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే మండల పశు వైద్యాధికారులను సంప్రదించాలని అన్నారు. జిల్లా పశు వైద్య, పశు సంవర్ధక శాఖాధికారి సంజయ్‌కుమార్, సహాయ సంచాలకులు శ్రీనివాస్, భాస్కరన్, డాక్టర్ ఆర్ దేవేందర్, పశు వైద్యులు, పారా సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
వందశాతం ఆస్తి పన్ను వసూలు చేయాలి
ఆస్తి పన్ను వంద శాతం వసూలు చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కలెక్టరేట్‌లో మున్సిపల్ అధికారులతో పలు అంశాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఆర్థిక సంవ త్సరంలో ఇంటిపన్ను వసూళ్లు, పాత బకాయిలను పూర్తిగా వసూలు చేయాలన్నారు. వసూళ్ల వివరా లు, నివేదికలను ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు తప్పనిసరిగా సమర్పించాలని ఆదేశించారు. పారిశుధ్య కార్యక్రమాలు క్రమం తప్పకుండా కొనసాగించాలని, సిబ్బంది హాజరు నమోదు చేయాల ని, ఇంటింటి నుంచి చెత్త సేకరించాలన్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేప ట్టాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఆధీనంలోని దుకాణ సముదాయల అద్దె వసూలు చేయాలని సూచించారు. భవన నిర్మాణాలకు సంబంధించిన ఆన్‌లైన్‌లో అనుమతులు మంజూరు చేయాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్‌లు, ఇంజినీరింగ్ అధికారులు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
చెక్ పోస్టుల్లో తనిఖీలు నిర్వహించండి
బర్డ్ ఫ్లూతో అప్రమత్తంగా ఉండాలి
వ్యాధి వ్యాప్తి చెందక ముందే
నివారణ చర్యలు చేపట్టాలి
అవగాహన సదస్సులో
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
Comments
Please login to add a commentAdd a comment