![అడ్డా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/onlinegames_mr-1738872111-0.jpg.webp?itok=fF4fTUKW)
అడ్డాల్లో భవిష్యత్ బలి!
స్మోకింగ్ జోన్‌లలో..
ఆన్‌లైన్ గేమ్‌లు.. వ్యసనాలు
కామారెడ్డి క్రైం : దేశ భవిష్యత్ యువతరం చేతుల్లో ఉందని అంతా భావిస్తుండగా.. అదే యువత చాయ్ అడ్డాలు, గ్రౌండ్‌లలో, చెట్ల కింద కనిపిస్తుండడం ఆందోళనకు గురి చేస్తోంది. మూతి మీద మీసం కూడా మొలవని వయస్సులోనే స్మోకింగ్ జోన్‌లలో కనిపిస్తున్న వారెందరో.. ఆన్‌లైన్ గేములు, ధూమపానం, మద్యపానం, గంజాయి వంటి వ్యసనాల బారిన పడుతూ ఎందరో యువకులు తమ బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కామరెడ్డి జిల్లా కేంద్రంలో ఇలాంటి యువకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. వ్యసనాల కారణంగా చాలామంది ఆర్ధికంగా, ఆరోగ్య పరంగా నష్టపోతుండటం ఆందోళనకు గురి చేసే అంశం. విద్యార్ధి దశలో ఉన్న వారిపై తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ప్రవర్తనలో మార్పును గమనించాల్సిందే..
వ్యవసాయం, తమ వృత్థులపై ఆధారపడే కుటుంబాలు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేస్తూ పట్టణాల్లో చదివిస్తున్నారు. ‘మా వాడు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళి బాగా కష్టపడి చదువుకుంటున్నాడని సంబంరపడుతుంటారు’. ఇలాంటి వారిలో చాలా మంది యువకులు పెడదోవలో వెళ్తున్నట్లు తల్లిదండ్రులు గుర్తించడం లేదు. కళాశాల యాజమాన్యాలు సైతం పిల్లల హాజరు నమోదు చేస్తున్నాయే తప్ప ఎప్పటికప్పుడు తల్లిదండ్రులతో సమన్వయం చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టించుకునే వారు లేక విద్యాభ్యాసం, క్రమశిక్షణ తప్పి యువత తమ భవిష్యత్‌ను తామే నాశనం చేసుకుంటున్నారు. పిల్లల ప్రవర్తన తీరులో వచ్చే మార్పులు, విద్యాబోధన తీరుపై విద్యా సంస్థలు, తల్లి దండ్రులు దృష్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది.
జిల్లా కేంద్రంలో ఇటీవల పదుల సంఖ్యలో స్మో కింగ్ జోన్‌లు వెలిశాయి. చాయ్ పేరుతో ఏర్పా టు చేస్తున్న వీటిల్లో లోపలి వైపు ప్రత్యేకంగా స్మోకింగ్ జోన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో యువకులే ఎక్కువగా కనిపిస్తున్నారు. స్నేహితులతో కలిసి గ్రూపులుగా వెళ్లే యువకులు చాయ్, సిగరెట్లు తాగుతూ గంటల తరబడి పబ్జీ వంటి ఆన్‌లైన్ గేమ్స్‌లో మునిగిపోతున్నారు. కళాశాలల సమయంలో సైతం స్మోకింగ్ జోన్‌లలో విద్యార్థులు కనిపిస్తుంటారు.
వ్యసనాల బారిన యువత
ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌లతో భవిష్యత్ నాశనం చేసుకుంటున్న వైనం
తల్లిదండ్రులను ఏమార్చి
సరదాల బాట
లోపించిన కళాశాలల
యాజమాన్యాల నిఘా
దృష్టి సారించకుంటే అనర్థాలే..
మత్తుకు దూరంగా ఉండాలి
యువత మత్తు పదార్థాలు, ఇతర దురలవాట్లకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులు కూడా ఓ కన్నేసి ఉంచాలి. పోలీస్ శాఖ తరఫున యువతకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. గంజాయి, ఇతర మత్తు పదార్థాలపై నిఘా కొనసాగుతోంది. బెట్టింగ్‌లు, ఆన్‌లైన్ గేమ్స్, వ్యసనాలను వదిలి చదువుపై దృష్టి సారించాలి.
– చంద్రశేఖర్ రెడ్డి, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి
వ్యసనాల బారిన పడొద్దు
విద్యార్థి దశలో దురలవాట్ల వైపు ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ వారి నడవడికపై ఓ కన్నేసి ఉంచాలి. దురలవాట్ల బారిన పడితే అనారోగ్య సమస్యలు తప్పవు. వాటి నుంచి బయటకు తెచ్చేందుకు కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ముందు జాగ్రత్తే అన్నింటికీ మంచిది. – డాక్టర్ జి.రమణ,
మానసిక ఆరోగ్య వైద్య నిపుణులు, కామారెడ్డి
స్మార్ట్ ఫోన్ కారణంగా యువత ప్రవర్తనలో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటున్న వారు కొందరైతే దుర్వినియోగం చేస్తున్న వారు ఎందరో.. పొద్దంతా రీల్స్ వ్యామోహంలో గడిపే వారి సంఖ్య ఎక్కువే. ఏడాది క్రితం స్మోకింగ్ జోన్‌లు, ఇతర అడ్డాలపై పోలీసులు దృష్టి సారించి చాలా మట్టుకు మూసి వేయించగా ప్రస్తుతం యథాతథంగా నడుస్తున్నాయి. ఎంతో మంది యువత గంజాయికి అలవాటుపడగా, కొందరు మద్యం, కల్తీ కల్లు వంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారు. మరి కొందరు క్రికెట్ బెట్టింగ్ మోజులో లక్షలు పోగొట్టుకున్న ఘటనలు అనేకం ఉన్నాయి.
![అడ్డాల్లో భవిష్యత్ బలి!1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/05kmr278-250034_mr-1738872112-1.jpg)
అడ్డాల్లో భవిష్యత్ బలి!
![అడ్డాల్లో భవిష్యత్ బలి!2](https://www.sakshi.com/gallery_images/2025/02/7/05kmr279-250034_mr-1738872112-2.jpg)
అడ్డాల్లో భవిష్యత్ బలి!
Comments
Please login to add a commentAdd a comment