యాసంగి సాగు ముమ్మరం | - | Sakshi
Sakshi News home page

యాసంగి సాగు ముమ్మరం

Published Wed, Dec 27 2023 1:28 AM | Last Updated on Wed, Dec 27 2023 1:28 AM

ఇరుకుల్లలో వరి నాటు వేస్తున్న మహిళా కూలీలు - Sakshi

ఇరుకుల్లలో వరి నాటు వేస్తున్న మహిళా కూలీలు

కరీంనగర్‌రూరల్‌: యాసంగి సీజన్‌ వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కొందరు రైతులు వరి నారు పోస్తుండగా మరికొందరు పొలాలను దున్నుతున్నారు. అయితే, సాగునీటి సమస్య తలెత్తే అవకాశం ఉందన్న ఉద్దేశంతో పలువురు అన్నదాతలు ముందస్తుగా నాట్లు వేయిస్తున్నారు. ఎస్సారెస్పీ నీటిపై ఆశతో ఉన్నవారు ఆరుతడి పంటలకు బదులు వరి సాగువైపే మొగ్గు చూపుతున్నారు.

వారబందీ విధానం అమలు

కరీంనగర్‌ మండలంలోని పలు గ్రామాల్లో ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమయ్యాయి. వానాకా లంలో వరి పంట సాగు చేసిన రైతులు చెరువులు, బావుల్లో పుష్కలంగా నీరు ఉండటం, ఎస్సారెస్పీ నీటి విడుదల నేపథ్యంలో యాసంగిలో సైతం వరి సాగుకే ముందుకొస్తున్నారు. ఈ నెల 18న ఎస్సారెస్పీ నుంచి నీళ్లు విడుదల చేయగా కరీంనగర్‌ మండలానికి బుధవారం నుంచి అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు. వారబందీ విధానంలో 8 రోజులు నీటి సరఫరా, 7 రోజులు నిలిపివేత పద్ధతిలో నీరందించనున్నారు. ఈ నెలలో ఒక తడి, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండేసి తడుల చొప్పున మొత్తం 7 నీటి తడులను విడుదల చేయనున్నారు. మండలంలో 13,009 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా వరిని 12,185 ఎకరాల్లో పండిస్తారని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అయితే, సాగునీటి సౌకర్యంతో ఈ విస్తీర్ణం మరింత పెరిగే అవకాశముంది. కరీంనగర్‌ రూరల్‌ డివిజన్‌ పరిధి(కొత్తపల్లితో కలిపి)లోని డీ–89 నుంచి డీ–94 కాల్వల వరకు ఎస్సారెస్పీ ఆయకట్టు కింద మొత్తం 14,987 ఎకరాలు సాగవుతుంది. అత్యధికంగా నగునూరులో 2,950 ఎకరాలు, చామనపల్లిలో 1,789, బొమ్మకల్‌లో 1,289, మొగ్ధుంపూర్‌లో 1,054, ఇరుకుల్లలో 1,086, చేగుర్తిలో 1,022, గోపాల్‌పూర్‌లో 993, ఎలబోతారంలో 935 ఎకరాల్లో పండించనున్నారు.

ఆయకట్టు చివరికీ నీరందిస్తాం

ఎస్సారెస్పీ నీళ్లు బుధవారం నుంచి అందుబాటులోకి వస్తాయి. ఆయకట్టు చివరి భూములకూ అంందించేలా చర్యలు తీసుకుంటాం. కాల్వల్లో నాచు, తుంగ, చెత్తాచెదారాన్ని జేసీబీతో తొలగించాం.

– సంతోష్‌, డీఈ, నీటిపారుదలశాఖ

నేటి నుంచి ఎస్సారెస్పీ నీటి తడులు

కరీంనగర్‌ రూరల్‌ డివిజన్‌లో వరినాట్లు ప్రారంభం

ప్రాజెక్టు ఆయకట్టు కింద

14,987 ఎకరాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement