![వాగు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11knt176-180027_mr-1739302076-0.jpg.webp?itok=05471FIn)
వాగు ఎడారి.. పొలం తడారి
ఎండిపోతున్న పొలాన్ని చూపుతున్న ఈ రైతు పేరు అట్ల సంపత్. నల్లగుంటపల్లెకు చెందిన సంపత్ రెండెకరాల్లో వరి సాగు చేశాడు. వ్యవసాయ బావితో పాటు సమీపంలోని ఇరుకుల్లవాగుపై
ఆధారపడిన సంపత్ ఆశ నిరాశవుతోంది. వేసవి ఆరంభానికి ముందే బావిలోని నీళ్లు అడుగంటిపోగా.. వాగు ఎడారిగా మారడంతో పొలం ఎండిపోతోంది. ఈ పరిస్థితి ఒక్క సంపత్‌ది కాదు..
ఇరుకుల్ల వాగు ఆయకట్టు పరిధి గ్రామాల్లోని రైతులందరిది.
● ఇరుకుల్ల వాగు కింద ఎండుతున్న పొలాలు
● ఆందోళనలో రైతులు
● నారాయణపూర్ చెరువు నీటి విడుదలకు డిమాండ్
కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండల పరిధిలోని పలు గ్రామాలకు సాగు, తాగునీటికి ఇరుకుల్ల వాగు ప్రధాన నీటివనరు. నగునూరు, ఎలబోతారం, గోపాల్‌పూర్, ఇరుకుల్ల, దుర్శేడ్, మొగ్ధుంపూర్, నల్ల గుంటపల్లి, మందులపల్లి గ్రామాలకు వాగులోని రక్షిత మంచినీటి బావుల నుంచి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. ఆయా గ్రామాల్లోని రైతులకు చెందిన వ్యవసాయబావులు, బోర్లు వాగులోనే ఉన్నాయి. ప్రత్యేకంగా వేసిన పైపులైన్ల నుంచి నీటిని పొలాలకు అందిస్తున్నారు. వేసవి ఆరంభానికి ముందే ఎండల తీవ్రతకు ఇరుకుల్ల వాగు ఎడారిగా మారుతోంది. వాగులోని వ్యవసాయబావుల్లో నీరు అడుగంటుతోంది. వాగుపై నగునూరు, గోపాల్‌పూర్, ఇరుకుల్ల, మొగ్ధుంపూర్ ప్రాంతాల్లో నిర్మించిన చెక్‌డ్యామ్‌ల్లో చుక్కనీరు నిల్వ లేక వెలవెలబోతున్నాయి. వాగు ఆయకట్టు పరిధిలోని పొలాలకు సరిపడేనీరు బావుల్లో లేకపోవడంతో రైతులు ఆందోళనచెందుతున్నారు. రాత్రి పగలు బావుల వద్దనే ఉంటూ నీళ్లు ఊరిన వెంటనే పొలాలకు అందిస్తున్నారు. అయినా ఎండవేడికి సరిపడేంత నీళ్లందక పలువురి పొలాలు ఎండిపోతున్నాయి. నల్లగుంటపల్లి, మొగ్ధుంపూర్ తదితర గ్రామాల్లో సుమారు 200ఎకరాల వరకు ఎండిపోయినట్లు రైతులు తెలిపారు. ఒకవైపు ఎస్సారెస్పీ నీళ్లు చివరి ఆయకట్టుకు అందకపోవడం, మరోవైపు ఇరుకుల్ల వాగుపూర్తిగా ఎండిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నారాయణపూర్ చెరువు నుంచి ఇరుకుల్ల వాగులోకి నీటిని విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.
![వాగు ఎడారి.. పొలం తడారి1](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11knt179-180027_mr-1739302077-1.jpg)
వాగు ఎడారి.. పొలం తడారి
![వాగు ఎడారి.. పొలం తడారి2](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11knt177-180027_mr-1739302077-2.jpg)
వాగు ఎడారి.. పొలం తడారి
![వాగు ఎడారి.. పొలం తడారి3](https://www.sakshi.com/gallery_images/2025/02/12/11knt178-180027_mr-1739302077-3.jpg)
వాగు ఎడారి.. పొలం తడారి
Comments
Please login to add a commentAdd a comment