సాక్షి ప్రతినిధి, కరీంనగర్: నిరుపేద రోగులకు సహాయం అందించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సహాయనిధి(సీఎంఆర్‌ఎఫ్)ని ప్రైవేట్ ఆస్పత్రులు కొల్ల గొడుతున్నాయి. పేషెంట్లకు ఎలాంటి ట్రీట్‌మెంట్ చేయకుండానే నకిలీ బిల్లులు, వైద్య పరీక్షలు, ప్రిస్క్రిప్షన్లు సృష్టించి, ప్రభుత్వాన్నే బురిడీ కొట్టించిన ఘటనలు సీఐడీ దర్యాప్తుతో వెలుగుచూస్తున్నాయి. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 ఆస్పత్రులు అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించగా, ఉమ్మడి జిల్లాలో రెండు దవాఖానాలు ఈ కుంభకోణంలో భాగమైనట్లు వెల్లడైంది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నడుస్తున్న సప్తగిరి, పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నడుస్తున్న శ్రీసాయి ఆస్పత్రులు నకిలీ బిల్లులతో రూ.లక్షలు కొల్లగొట్టినట్లు దర్యాప్తులో తేలింది. ఈ మేరకు సీఐడీ అధికారులు కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. కాగా, సామాన్యులు సీఎంఆర్‌ఎఫ్ బిల్లులు పొందాలంటే.. ఆస్పత్రుల్లో రూ.లక్షల బిల్లులు చెల్లిస్తే ప్రభుత్వం నుంచి 30 నుంచి 40 శాతం మాత్రమే అందేవి. కానీ, అక్రమార్కులు మాత్రం పేషెంట్లు లేకుండానే బిల్లులు పెట్టడం ఒకింత ఆశ్చర్యం కలిగిస్తోంది. నకిలీ బిల్లులు, టెస్టులు, ప్రిస్క్రిప్షన్‌లతోపాటు కొంతమంది అనుయాయులకు చెందిన ఆధార్, తెల్ల రేషన్ కార్డులను సైతం పెట్టి, బిల్లులు పొందినట్లు తెలుస్తోంది. డబ్బులు సదరు వ్యక్తుల అకౌంట్లలోకి రాగానే ఆస్పత్రుల యాజమాన్యాలు డ్రా చేసుకొని, బినామీలకు ఎంతోకొంత ముట్టజెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారం కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దృష్టిసారించింది. రాష్ట్రవ్యాప్తంగా వేల ఆస్పత్రులు ఉన్నప్పటికీ కొన్ని దవాఖానాలకే అడ్డగోలుగా బిల్లులు మంజూరవడంతో అనుమానం వచ్చి, సీఐడీతో విచారణ చేయించింది. అక్రమంగా బిల్లులు పొందినట్లు తేలడంతో సీఐడీ సుమారు 30 ఆస్పత్రులపై కేసులు నమోదు చేసినట్లు సమాచారం. మరి అక్రమంగా నొక్కిన సొమ్మును కక్కిస్తారో.. కేసులతో సరిపెడతారో చూడాలి.
నకిలీ బిల్లులతో ప్రభుత్వానికే బురిడీ
రూ.లక్షలు కొల్లగొట్టిన
ప్రైవేటు దవాఖానాలు
ఉమ్మడి జిల్లాలో
రెండు ఆస్పత్రులపై సీఐడీ కేసు!
Comments
Please login to add a commentAdd a comment