అక్రమాలకు అడ్డుకట్ట
కరీంనగర్ అర్బన్: అటవీశాఖలో ఇక అనుమతులు సులువే. దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేస్తుండటంతో కార్యాలయంలో నిరీక్షణకు తెరపడినట్లే. అటవీశాఖలో ఒకే దేశం–ఒకే అనుమతి (వన్ నేషన్–వన్ పర్మిట్) విధానం అమల్లోకి వచ్చింది. కలప, వెదురుతో పాటు అటవీ ఉత్పత్తులను దేశంలో ఎక్కడినుంచి ఎక్కడికై నా తరలించేందుకు వెసులుబాటు కల్పిస్తుంది. ఇదంతా ఆన్‌లైన్ వేదికగా జరగడంతో క్షేత్రస్థాయిలో అనుమతులు ఇక సులభమే. కలప ఉత్పత్తుల తరలింపులో కొందరు సామిల్ నిర్వాహకులు చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలున్న నేపథ్యంలో ఈ విధానంతో అడ్డుకట్ట పడనుంది.
ఆన్‌లైన్‌తో పారదర్శక విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. కార్యాలయం, అధికారుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. దరఖాస్తును పరిశీలించి అనుమతులు జారీచేయాల్సిన బాధ్యత అధికారులదే. ఒకవేళ తిరస్కరించినా తగిన కారణం చూపాల్సిందే. దీనివల్ల సాధారణ ప్రజానీకానికి ప్రయోజనం కలుగుతుంది. కేవలం కలపనే కాదు.. వెదురు. అడవుల్లో దొరికే ఇతర ఉత్పత్తులు ఏవైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని మనకు కావాల్సిన ప్రదేశానికి తరలించేందుకు అవకాశం ఏర్పడింది. కేవలం మన జిల్లా, రాష్ట్రం పరిధిలోనే కాదు.. దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా వీటిని తీసుకెళ్లేందుకు ఈ అనుమతి సరిపోతుంది. నూతన విధానంపై ఇప్పటికే జిల్లా పరిధిలోని సామిల్, టింబర్ డిపో నిర్వాహకులకు అటవీ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ విధానం ఎలా పనిచేస్తుంది. ఎలా దరఖాస్తు చేయాలి, ఏ వివరాలు నమోదు చేయాలి, ఎంత కాలంలో అనుమతులొస్తాయి.. ఇలా అన్నిరకాల అంశాలను వారికి వివరించారు. సందేహాలను నివృత్తి చేశారు.
ఎన్టీపీఎస్ పోర్టల్‌లోనే దరఖాస్తు
కొత్త విధానంలో అనుమతులు పొందేందుకు నేషనల్ ట్రాన్సిట్ పాస్ సిస్టం (ఎన్టీపీఎస్) పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పేరు, ఫోన్‌నంబర్ వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వాటి ఆధారంగా పోర్టల్‌లో లాగిన్ అయి మనకు కావాల్సిన అనుమతిని పొందాల్సి ఉంటుంది. అన్ని వివరాలను పొందుపరిస్తే అవి ఆ ప్రాంత ఎఫ్‌ఆర్‌వోకు చేరుతుంది. అన్నీ పరిశీలించుకొని నిర్ధారణ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి డీఎఫ్‌వోకు చేరుతుంది. దరఖాస్తు, ఎఫ్‌ఆర్వో సిఫార్సు ఆధారంగా డీఎఫ్‌వో అనుమతులు జారీ చేస్తారు. ఇదంతా ఆన్‌లైన్ ప్రక్రియ కావడంతో కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. కేవలం 24 గంటల వ్యవధిలో అనుమతులు జారీ అవుతాయి.
అక్రమాలకు చెక్
మన వ్యక్తిగత స్థలంలోనో, పంట పొలంలోనో టేకు చెట్లున్నాయి. వాటిని కొట్టి కర్రను వినియోగించుకోవాలనుకుంటే.. ఇది వరకు అటవీశాఖ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. అదే సమయంలో అధికారులు, సిబ్బంది చేయి తడిపితేనో, లేక రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తేనో పనవుతుంది. లేకపోతే కాదనే భావన చాలామందిలో నెలకొంది. దీనికి నిదర్శనమే అన్నట్లుగా నిబంధనలు, ఇతరత్రా అంశాలను సాకుగా చూపి తిప్పించుకున్న ఘటనలూ ఏసీబీకి పట్టించిన ఘటనలు లేకపోలేదు. సామిల్‌లో కలపతో తయారైన వస్తువులను, టింబర్ డిపోలో ఉన్న కర్రను కొనుగోలు చేసిన వినియోగదారులు వాటిని తమ ప్రాంతానికి తీసుకెళ్లాలంటే అటవీ అధికారుల అనుమతి తప్పనిసరి. ఇదంతా మ్యానువల్ విధానంలో ఉండేది. కర్ర పరిమాణం, కర్రతో తయారుచేసిన వస్తువులు, ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎక్కడకు తీసుకెళ్తారు, ఏ వాహనంలో తరలిస్తారు.. ఇలా అన్ని వివరాలను రాసి, ఎస్‌ఆర్‌సంతకం తీసుకున్నాకే తరలించేందుకు అవకాశం ఉండేది. ఈ అనుమతి రాకపోతే వ చ్చేవరకు ఎదురుచూడాల్సి వచ్చేది. అయితే.. కొందరు సామిల్ నిర్వాహకులు అధికారులను మచ్చిక చేసుకొని సదరు అనుమతిని దుర్విని యోగం చేశారన్న ఆరోపణలున్నాయి. ఒకటే పర్మి ట్‌ను నాలు గైదు చోట్లకు వినియోగించడం, తక్కువ వస్తువులను చూపి ఎక్కువ తరలించడం.. ఇలా చేతివాటం ప్రదర్శించేవారన్న విమర్శలు కోకొల్లలు.
అటవీశాఖలో ‘ఒకే దేశం–ఒకే అనుమతి’ అమలు
ప్రజలకు సత్వర అనుమతులు
Comments
Please login to add a commentAdd a comment