‘కమర్షియల్ వేస్ట్’.. ప్రైవేటుకు!
● వ్యాపార సంస్థల నుంచి చెత్త సేకరణ బాధ్యత ఏజెన్సీకి.. ● అప్పగించేందుకు కసరత్తు చేస్తున్న నగరపాలిక ● లాభంతోపాటు శుభ్రతే లక్ష్యం ● వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ
కరీంనగర్ కార్పొరేషన్: లాభం.. శుభ్రతే లక్ష్యంగా కమర్షియల్ వేస్ట్ కలెక్షన్‌ను ప్రైవేట్‌కు అప్పగించేందుకు నగరపాలక సంస్థ ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, అపార్ట్‌మెంట్లు, మాల్స్, షాపులు తదితర వ్యాపార సంస్థల నుంచి చెత్త సేకరణను ఇకనుంచి ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టేందుకు నిర్ణయించింది. వచ్చే నెలలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు రంగం సిద్ధమైంది.
అనుకున్నమేర రాని ఆదాయం..
ప్రస్తుతం నగరపాలక సంస్థ పారిశుధ్య సిబ్బంది నిత్యం నగరంలోని వ్యాపార సంస్థల నుంచి చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా 2 ట్రాక్టర్లు, 10 మందికి పైగా కార్మికులను నగరపాలక సంస్థ వినియోగిస్తోంది. సేకరించే చెత్తకు ప్రత్యేకంగా రుసుము వసూలు చేస్తున్నారు. నగరపాలికకు ఇలా ఏటా సుమారు రూ.60 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఈ క్రమంలో అనుకున్నమేర ఆదాయం రాకపోగా, ట్రాక్టర్లు, లేబర్‌ను ప్రత్యేకంగా ఆ పనికే పరిమితం చేయాల్సి వస్తోందని అధికారులు భావిస్తున్నారు. పైగా రాత్రివేళల్లో కార్మికులు రోడ్లను ఊడ్చినప్పటికీ, తెల్లవారిన తర్వాత వ్యాపారులు చెత్త వేస్తున్నారు. దీంతో రోడ్లు ఊడ్చినా ఫలితం ఉండటం లేదు. అంతేకాకుండా, వాణిజ్యపరమైన చెత్త సేకరణలోనూ కొంతమంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో నగరపాలక సంస్థ ఆదాయానికి భారీగా గండి పడుతోంది. అందుకే ప్రైవేటు ఏజెన్సీకి ఆ బాధ్యతను అప్పగిస్తే నగరపాలికకు ఆదాయంతోపాటు రోడ్లు శుభ్రంగా ఉంటాయన్న నిర్ణయానికి వచ్చారు. ఏజెన్సీకి చెత్త సేకరణను అప్పగిస్తే ఏడాదికి కనీసం రూ.2.50 కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, కాంట్రాక్ట్ పొందిన సంస్థ విధిగా ఆయా వ్యాపార సంస్థల నుంచి రుసుము వసూలు చేస్తుంది కాబట్టి, చెత్తను రోడ్లపై పడేయడం తగ్గే అవకాశం ఉంటుంది. ఖమ్మం, వరంగల్, సిద్దిపేట తదితర పట్టణాల్లో ఇదే విధానం కొనసాగుతోంది. ఇలా రెండు రకాల లాభాలుంటాయనే అంచనాతో నగరపాలక సంస్థ కమర్షియల్ వేస్ట్ కలెక్షన్‌ను ప్రైవేటుకు అప్పగించాలనుకుంటున్నారు.
టెండర్ రూపకల్పనలో నిమగ్నం..
కమర్షియల్ వేస్ట్ కలెక్షన్‌ను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. లోటుపాట్లు లేకుండా, తర్వాత ఇబ్బందులు తలెత్తకుండా టెండర్‌ను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వచ్చే నెలలో ఎట్టిపరిస్థితుల్లోనూ టెండర్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రైవేట్‌కు అప్పగించాలని నిర్ణయించారు. కాగా, హాస్పిటళ్ల మెడి వేస్ట్, చికెన్ వేస్ట్ కలెక్షన్‌ను ఇప్పటికే ప్రైవేట్ సంస్థలు చేస్తుండగా, ఇవికాకుండా కమర్షియల్ వేస్ట్‌ను సేకరించేందుకు టెండర్ నిర్వహించనున్నారు. కాంట్రాక్ట్ అప్పగించిన అనంతరం ఆ సంస్థ సేకరించిన తడి చెత్తను కంపోస్ట్, పొడి చెత్తను రీసైక్లింగ్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల సేకరించిన చెత్తలో కేవలం 40 శాతం మాత్రమే డంపింగ్‌యార్డుకు చేరుతుంది.
Comments
Please login to add a commentAdd a comment