హుస్నాబాద్ మార్కెట్ కమిటీ నియామకం
● చైర్మన్‌గా కంది తిరుపతిరెడ్డి
చిగురుమామిడి: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్వర్వులు జారీ చేసింది. చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ చిగురుమామిడి మండల అధ్యక్షుడు కంది తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్‌గా పార్టీ హుస్నాబాద్ మండల అధ్యక్షుడు బంక చందుతోపాటు 18 మంది పాలకవర్గ సభ్యులను నియమించింది. ఈ మార్కెట్ పరిధిలో చిగురుమామిడి, హుస్నాబాద్, అక్కనపేట్ మండలాలున్నాయి. చిగురుమామిడి మండలం నుంచి కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఓరుగంటి భారతీదేవి, ఎండీ.కుతుబుద్దీన్, బొడిగె పర్శరాములుకు పాలకవర్గంలో చోటు దక్కింది.
పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించండి
● సీపీ అభిషేక్ మహంతి
చిగురుమామిడి: పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని సీపీ అభిషేక్ మహంతి ఆదేశించారు. వార్షిక తనిఖీల్లో శుక్రవారం చిగురుమామిడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించి, ఎస్సై రాజేశ్, పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. వివిధ నేరాల్లో పట్టుబడిన వాహనాల వివరాలు తెలుసుకొని, వాటిని తొలగించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించడంతోపాటు స్టేషన్ పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలని సూచించారు. నేరాలు ఎక్కువ జరిగే ప్రాంతాలు, పాత నేరస్తులపై నిఘా ఉంచాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారిని గుర్తించి, రౌడీషీట్లు తెరవాలని పేర్కొన్నారు. సైబర్ నేరాల బారిన పడకుండా గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. తరచూ రోడు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను యాక్సిడెంట్ జోన్లుగా, బ్లాక్ స్పాట్‌లుగా గుర్తించాలన్నారు. గంజాయి రవాణాతోపాటు ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, పీడీఎస్ బియ్యం తరలించేవారిపై, పేకాడేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట తిమ్మాపూర్ సీఐ స్వామి ఉన్నారు.
ప్రమాద బీమా సద్వినియోగం చేసుకోండి
● యూబీఐ డీజీఎం అపర్ణరెడ్డి
చొప్పదండి: బ్యాంకులో వ్యవసాయ, మహిళా సంఘాల, ఇతర రుణాలు తీసుకునే సమయంలో ప్రతీ ఖాతాదారు ప్రమాద బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరీంనగర్ రీజియన్ డీజీఎం డి.అపర్ణరెడ్డి అన్నారు. బ్యాంకు చొప్పదండి బ్రాంచిలో భూపాలపట్నంకు చెందిన మునిగాల దేవవరం అనే రైతు రూ.8 లక్షల దీర్ఘకాలిక రుణం తీసుకున్నాడు. తర్వాత పక్షవాతంతో చనిపోయాడు. అతను ప్రమాద బీమా కింద ప్రీమియం చెల్లించినందున బాధి త కుటుంబానికి క్రిటికల్ ఇల్‌నెస్ కింద మంజూరైన రూ.10 లక్షలను శుక్రవారం బ్యాంకు ఆవరణలో అందజేశారు. కార్యక్రమంలో బ్యా ంకు మేనేజర్ శివతేజ, రాము, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ మేనేజర్ రాజు పాల్గొన్నారు.
రేపటి నుంచి కరీంనగర్– కాచిగూడ ప్రత్యేక రైళ్లు
కరీంనగర్‌రూరల్: కరీంనగర్–కాచిగూడ మధ్య ఈ నెల 24, 25, 26, 28వ తేదీల్లో ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు కరీంనగర్ రైల్వేస్టేషన్ మేనేజర్ రవికుమార్ ఒక ప్రకటనలో తెలిపా రు. ఆర్‌ఆర్‌బీ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం దక్షిణమధ్య రైల్వే వీటిని నడుపుతున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో ఉదయం 6 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి, మధ్యాహ్నం 2 గంటలకు కాచిగూడకు చేరుకుంటుందన్నారు. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment