కరీంనగర్: జిల్లా విద్యాశాఖ పట్టింపులేనితనంతో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డూఅదుపు లేకుండాపోతోంది. ఏటా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేయడం, పాఠశాలల బంద్‌కు పిలుపునివ్వడం, తర్వాత యథేచ్ఛగా పాఠశాలల్లో ఫీజుల వసూలు కొనసాగడం పరిపాటిగా మారింది. తాజాగా పదోతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల నుంచి ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.125 పరీక్ష ఫీజు తీసుకోవాలి. కానీ, ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా ఒక్కో విద్యార్థి నుంచి రూ.500–రూ.1,000 వరకు వసూలు చేస్తూ పిల్లల తల్లిదండ్రుల జేబులు గుల్ల చేస్తున్నారు.
28 వరకు గడువు పెంపు..
ఈ విద్యాసంవత్సరం కరీంనగర్ జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల నుంచి 12 వేల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరు కానున్నారు. పరీక్షలకు సంబంధించి ఫీజును ఈ నెల 18లోగా చెల్లించాలని ప్రభుత్వం సూచించింది. గడువు ముగియడంతో ఈ నెల 28వ తేదీ వరకు పెంచింది. రూ.50 అపరాధ రుసుముతో వచ్చే నెల 5వ తేదీ వరకు చెల్లించవచ్చని చెప్పింది. దీంతో చాలాచోట్ల ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు సిండికేట్‌గా మారి, అడ్డగోలుగా ఫీజులు తీసుకుంటున్నాయి. ఇదంతా సంబంధిత ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ నెల 30లోగా సంబంధింత హెచ్‌ఎంలు విద్యార్థుల ఫీజు డబ్బులను ట్రెజరీలో చెల్లించడంతోపాటు పిల్లల వివరాలతో కూడిన నామినల్ రూల్స్‌ను డీఈవో కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
నోటీసు బోర్డులో కానరాని వివరాలు
ప్రతీ పాఠశాలలో తరగతివారీగా ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో ఉంచాలి. అలాగే, ఉపాధ్యాయుల అర్హత వివరాలను పొందుపర్చాలి. చాలాచోట్ల ఫీజుల పట్టికను ఏర్పాటు చేయడం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం, యాజమాన్యాలను ఎవరూ ప్రశ్నించకపోవడంతో వారు ఆడిందే ఆటగా సాగుతోంది.
యూడైస్‌లో నమోదుతో ఇబ్బందులు
ఉన్నత పాఠశాలల్లో 6–10 తరగతి విద్యార్థుల వివరాలను యూడైస్ ప్లస్ యాప్‌లో నమోదు చేయాలన్న నిబంధన పెట్టారు. ఏ ఒక్క విద్యార్థి సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు కాకపోయినా పదోతరగతి విద్యార్థుల ఫీజు చెల్లింపు ప్రక్రియకు అంతరాయం ఏర్పడనుంది. పరీక్షలు రాసే పిల్లల వివరాలతో నామినల్ రూల్స్(ఎన్‌ఆర్) తయారు చేసి, డీఈవోల ద్వారా రాష్ట్ర పరీక్షల విభాగం అధికారులకు పంపాల్సి ఉంటుంది. గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు హెచ్‌ఎంలు ఇబ్బందులు పడుతున్నారు. పదోతరగతి విద్యార్థుల ఫీజు చెల్లింపునకు సాంకేతిక సమస్యలు ఎదురవుతుండటంతో విద్యాశాఖ అధికారులు తల పట్టుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment