ఎములాడలో గీతాజయంతి ఉత్సవాలు
వేములవాడ: ఎములాడ శ్రీరాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం ఉదయం 6.30 గంటలకు గీతా జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులపాటు స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అనుబంధ దేవతామూర్తులకు ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తామని స్థానాచార్యుడు అప్పాల భీమాశంకర శర్మ తెలిపారు. గీతాహోమం, గీతా ప్రవచనాలు, గీతాపారాయణం, దశమస్కంద పారాయణాలు, సాయంత్రం ప్రవచనాలు, గీతాభాష్య పారాయణాలు జరుపుతామన్నారు. ఈ నెల 12న పూర్ణాహుతితో ఉత్సవాలు ముగుస్తాయని తెలిపారు. జనవరి 10న వైకుంఠ ఏకాదశి నిర్వహిస్తామని పేర్కొన్నారు. సంస్కృత కళాశాల, వేద పాఠశాల విద్యార్థులు, అధ్యాపకులు నాగిరెడ్డి మండపంలో గీతా పారాయణం చేశారు. ప్రిన్సిపాల్ మల్లారెడ్డి, అధ్యాపకులున్నారు.
అభిషేకాలు.. అన్నపూజలు
వేములవాడ రాజన్నను మంగళవారం దాదాపు 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారని అధికారులు తెలిపారు. ధర్మగుండంలో స్నానాలు చేసినవారు స్వామివారికి అభిషేకాలు, అన్నపూజలు, కల్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, అమ్మవారికి కుంకుమపూజ ద్వారా మొక్కులు చెల్లించుకున్నారు.
రాజన్న సేవలో ఆదిలాబాద్ ఎస్పీ
వేములవాడ రాజన్నను ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం కుటుంబసభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. అనంతరం కోడెమొక్కు చెల్లించుకున్నారు. అర్చకులు కల్యాణ మండపంలో స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం అందించి, వేదోక్త ఆశీర్వచనం గావించారు. ఎస్సై అంజయ్య, ఆలయ ఇన్‌స్పెక్టర్ నరేందర్, ప్రొటోకాల్ ఇన్‌చార్జి శివసాయి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment