విద్యార్థులు ప్రపంచ వేదికపై మెరవాలి
కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రపంచవేదికపై తమ ఉపన్యాసాలను ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను టీఈడీ ‘స్టూడెంట్స్ టాక్’ కార్యక్రమానికి పంపేందుకుగానూ జిల్లా విద్యాశాఖ, పారమిత విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఎంపిక కార్యక్రమం మంగళవారం పద్మనగర్‌లోని పారమిత పాఠశాలలో నిర్వహించారు. జిల్లాలోని 176 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 345 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా 40మంది ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్నారు. వారి నుండి ఇద్దరిని ఎంపిక చేసి ప్రపంచస్థాయి టెడ్‌ఎడ్ ఉపన్యాసానికి పంపించనున్నారు. ఎంపిక కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ ఈ శిక్షణ ప్రభుత్వ విద్యార్థులకు భవిష్యత్తులో మంచి మార్గం చూపుతుందన్నారు. టెడ్ వేదికపై కరీంనగర్ ప్రభుత్వ విద్యార్థి సత్తా చాటి జిల్లాలోని 57వేలమంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలన్నారు. ఆరేళ్లుగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదివి ఆపేసిన విద్యార్థులందరికీ పరీక్ష రాయించామని తెలిపారు. అందులో 80శాతం మంది ఉత్తీర్ణత సాధించి, ఉన్నత విద్య అభ్యసిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఈవో జనార్దన్‌రావు, పారమిత విద్యాసంస్థల చైర్మన్ ప్రసాదరావు, గంగాధర మండల విద్యాధికారి ప్రభాకర్‌రావు, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్‌రెడ్డి, సైన్స్ అధికారి జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
● కలెక్టర్ పమేలా సత్పతి
Comments
Please login to add a commentAdd a comment