అదనంగా పోలింగ్ కేంద్రాలు
● అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్
కరీంనగర్ అర్బన్: జిల్లాలో ఓటర్ల సంఖ్య క్రమంలో అదనంగా పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌స్టేషన్ల ఏర్పాటుపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల7న ఓటరు జాబితా ప్రదర్శించామన్నారు. 15 మండలాల పరిధిలో మొత్తం 5,35,246 ఓటర్లుండగా.. పురుషులు 2,60,889 కాగా మహిళలు 2,74,346 ఉన్నట్లు వివరించారు. జిల్లాలో 323 గ్రామ పంచాయతీలుగా 320 గ్రామాల్లో 3,000 వార్డులు ఉన్నాయని, వార్డుకో పోలింగ్ స్టేషన్ చొప్పున 3026 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం 650 మంది ఓటర్లు దాటిన వార్డులో అదనంగా మరో పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. చింతకుంట, బొమ్మకల్ గ్రామాల్లోని వార్డుల్లో అదనంగా పోలింగ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను డీపీవో రవీందర్ రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. రామడుగు మండలం వెలిచాల పంచాయతీలోని గుడ్డేలుగులపల్లిలో, కొత్తపల్లి మండలం నాగులమల్యాల పంచాయతీలోని కొత్త కొండాపూర్‌లో పోలింగ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. శిక్షణ కలెక్టర్ అజయ్ యాదవ్, డీఆర్‌వో బి.వెంకటేశ్వర్లు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు మాడెపు మోహన్ (కాంగ్రెస్), సత్తినేని శ్రీనివాస్ (బీఆర్‌ఎస్), నాంపల్లి శ్రీనివాస్ (బీజేపీ), వాసుదేవరెడ్డి (సీపీఐ(ఎం)), కల్ల పెళ్లి రాజేందర్ (బీ ఎస్పీ), మహమ్మద్ అఖిల్ ఫిరోజ్ (ఎంఐఎం), కల్యాడపు ఆగయ్య (టీడీపీ) పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment