శంకరపట్నం(మానకొండూర్): తాళం వేసిన ఇంట్లో చొరబడిన దుండగులు బంగారు గొలుసు, నగదు చోరీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. శంకరపట్నం మండలంలోని అర్కండ్లకు చెందిన నేదురు ఐలమ్మ సోమవారం ఇంటికి తాళం వేసి, పుట్టింటికి వెళ్లింది. మంగళవారం ఉదయం వచ్చేసరికి తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లిచూడగా.. రూ.74 వేలు, 2 తులాల బంగారు గొలుసు కనిపించలేదు. చోరీ జరిగినట్లు నిర్ధారించుకొని, కేశవపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఇదే గ్రామానికి చెందిన ఓ కుటుంబంపై అనుమానం ఉందని చెప్పింది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు.
వెంకటాపూర్ గ్రామంలో..
కోరుట్ల రూరల్: తాళం వేసిన రెండిళ్లలో దుండగులు చొరబడి, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. పోలీసుల వివరాల ప్రకారం.. కోరుట్ల రూరల్ మండలంలోని వెంకటాపూర్‌కు చెందిన కొత్తపెల్లి రాజేశ్వరి, పల్లా లక్ష్మీరాజం సోమవారం తమ ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబసభ్యులతో కలిసి ఊరెళ్లారు. మంగళవారం ఉదయం పక్కింటివాళ్లు చూడగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. వెంటనే బాధితులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి, చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. మూడున్నర తులాల బంగారు ఆభరణాలు పోయాయని రాజేశ్వరి, రెండు తులాల బంగారు ఆభరణాలు పోయాయని లక్ష్మీరాజం ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment