కూతురిని కడతేర్చిన తండ్రికి జీవిత ఖైదు
కరీంనగర్ క్రైం: దివ్యాంగురాలైన కూతురిని హత్య చేసిన తండ్రికి జీవిత ఖైదుతోపాటు రూ.1,000 జరిమానా విధిస్తూ కరీంనగర్ జిల్లా జడ్జి బి.ప్రతిమ తీర్పునిచ్చారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లికి చెందిన కొమిరె మహేందర్ భార్య చనిపోవడంతో చంద్రపురి కాలనీకి చెందిన భావనను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు పాప జన్మించింది. 6 నెలలకు ఆ చిన్నారికి తీవ్ర జ్వరం రావడంతో నరాలు దెబ్బతిని, కాళ్లూచేతులు పడిపోయాయి. ఆరేళ్ల వయసు వచ్చినా ఆ పాప కోలుకోలేదు. ఈ క్రమంలో మహేందర్ ఏ పనీ చేయకుండా మద్యానికి బానిసయ్యాడు. భార్యాబిడ్డను తరచూ వేధిస్తుండేవాడు. దీంతో భావన 2023 ఫిబ్రవరి చివరి వారంలో బిడ్డను వదిలేసి, పుట్టింటికి వెళ్లిపోయింది. కూతురిని చంపేందుకు ఇదే అదునుగా భావించిన మహేందర్ అదే ఏడాది మార్చి1న రాత్రి ఆమెను హత్య చేసి, కెనాల్‌లో పడేశాడు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కరీంనగర్ రూరల్ పోలీసులు మహేందర్‌పై కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ విజ్ఞాన్‌రావు దర్యాప్తు చేపట్టారు. సీఎంఎస్‌ఏ ఎస్సై తిరుపతి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వెంకటేశ్వర్లు విచారించారు. న్యాయమూర్తి సాక్ష్యాధారాలు పరిశీలించి, మహేందర్‌కు శిక్ష విధిస్తూ మంగళవారం తీర్పు వెల్లడించారు.
విదేశాల్లో ఉద్యోగావకాశాలు
సిరిసిల్లకల్చరల్: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) ఆధ్వర్యంలో అర్హత, నైపుణ్యం గల వారికి విదేశాల్లో ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ తెలిపారు. దుబాయ్ లాంటి దేశాల్లో డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకు ఎస్సెస్సీ విద్యార్హత, రెండేళ్ల అనుభవం చాటే డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు 40 ఏళ్ల లోపు వయసు గలవారు అర్హులని పేర్కొన్నారు. ఇంటర్ అర్హతతో సెక్యూరిటీ గార్డు పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. కలెక్టరేట్‌లోని టామ్‌కామ్ కార్యాలయంలో ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 94400 50951 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
గడియారానికి బదులు రాళ్లు
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రూ.2 వేల విలువైన వాచ్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వ్యక్తికి రాళ్లు, చిన్న పిల్లలు ఆడుకునే వాచ్ వచ్చాయి. బాధితుడి వివరాల ప్రకారం.. రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన రాజు నాలుగు రోజుల క్రితం రూ.2 వేల విలువైన వాచ్‌ను బుక్ చేశాడు. మంగళవారం డెలవరీ బాయ్‌కి డబ్బులు చెల్లించి, బాక్స్‌ను తీసుకున్నాడు. ఓపెన్ చేసి, చూడగా.. అందులో ఎక్వేరియంలో ఉపయోగించే రంగు రాళ్లు, చిన్న పిల్లలు ఆడుకునే వాచ్ ఉన్నాయి. ఈ విషయమై డెలివరీ బాయ్‌ని ప్రశ్నించగా తనకు తెలియదన్నాడు. ఫోన్‌లోనే ఆర్డర్ రిటర్న్ పెట్టాలని చెప్పాడు.
ఇసుక లారీల అడ్డగింత
మానకొండూర్ రూరల్: మండలంలోని ఊటూరులో ఇసుక లారీలను స్థానికులు మంగళవారం కూడా అడ్డగించారు. గ్రామ శివారులోని మానేరు వాగు ఇసుక క్వారీ నుంచి ఇసుకను తరలిస్తుండగా సోమవారం సాయంత్రం అడ్డుకున్నారు. ఇసుకను అధిక మొత్తంలో తీసుకెళ్తున్నారని ఆరోపించారు. లారీలు వెళ్తుండటంతో రోడ్డు పాడవుతోందని, దుమ్ము, ధూళితో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఇసుకను నిర్ణీత సమయంలో కాకుండా రాత్రింబవళ్లు తరలిస్తున్నారని మండిపడ్డారు.
వ్యభిచార
నిర్వాహకులపై కేసు
జగిత్యాల క్రైం: జగిత్యాల పట్టణ శివారులోని బైపాస్‌రోడ్‌లో ఓ వ్యభిచార గృహంపై పోలీసులు మంగళవారం దాడి చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలతోపాటు, ఇద్దరు విటులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కిరణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment