దేవాదాయ శాఖ అధికారుల అడ్డగింత
● ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని శాఖ పరిధిలోకి తీసుకోవడంపై అభ్యంతరం
● వీడీసీ ఆధ్వర్యంలోనే
కొనసాగాలన్న సభ్యులు
మెట్‌పల్లిరూరల్: మెట్‌పల్లి మండలంలోని వెల్లుల ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దేవదాయశాఖ పరిధిలోకి తీసుకోవద్దని వీడీసీ సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇటీవల ఉత్తర్వులు జారీ చేసిన సంబంధిత అధికారులు మంగళవారం ఆలయానికి రావడంతో వారితో వాగ్వాదానికి దిగారు. ఆలయ నిర్వహణ వీడీసీ ఆధ్వర్యంలోనే కొనసాగాలన్నారు. ఇందుకు వారు అంగీకరించలేదు. పోలీసుల బందోబస్తు మధ్య ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సయమంలో కొద్దిసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెట్‌పల్లి సీఐ నిరంజన్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది వీడీసీ సభ్యులను, గ్రామస్తులను సముదాయించారు. దేవదాయ, ధర్మాదాయ శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ సుప్రియ స్థానిక వ్యాపారులతో మాట్లాడారు. తైబజార్ రుసుము, మేక, కోడి కోతకు ఎంత వసూలు చేస్తున్నారు.. తదితర విషయాలపై ఆరా తీశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. నేటి నుంచి ఆలయ ఈవోగా కాంతారెడ్డి బాధ్యతలు తీసుకుంటారని తెలిపారు. ప్రతీ మంగళవారం ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారన్నారు. వారు అమ్మవారికి సమర్పించే కానుకలు, డబ్బులు పక్కదారి పడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని, విచారణలో నిజమేనని తేలిందన్నారు. ఈ కారణంగానే ఎల్లమ్మ తల్లి ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అధికారుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీడీసీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావును కలిశారు. ఆలయ నిర్వహణ వీడీసీ ఆధ్వర్యంలోనే సాగేలా చూడాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment