అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు
కరీంనగర్ క్రైం: అంతరాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు కరీంనగర్ వన్ టౌన్ సీఐ కోటేశ్వర్ తెలిపారు. మంగళవారం ఠాణాలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. కరీంనగర్ క్రిస్టియన్ కాలనీకి చెందిన ఉప్పుగుండ్ల మురళీకృష్ణ తల్లి రాజమణి కరీంనగర్ కట్టరాంపూర్‌లోని శాతవాహన కాలనీలో నివాసం ఉంటోంది. గత నెల 23న ఇంటికి తాళం వేసి, ఊరెళ్లింది. రెండు రోజుల తర్వాత తిరిగిరాగా, తాళం పగులగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా టీవీ ధ్వంసమైంది. బీరువాలోని 20 గ్రాముల బంగారు, 46 గ్రాముల వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుంది. కరీంనగర్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ కోటేశ్వర్ కేసు నమోదు చేసి, తన సిబ్బందిని అప్రమత్తం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మంగళవారం స్థానిక గౌతమి నగర్ వద్ద వాహనాల తనిఖీ చేపడుతుండగా ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కందుల సత్యనారాయణ అలియాస్ సత్తిబాబు అనుమానాస్పదంగా కనిపించాడు. అతన్ని అదుపులోకి తీసుకొని, విచారణ జరుపగా చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. సత్తిబాబును కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. అతనిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 20కి పైగా కేసులున్నట్లు, గతంలో జైలుశిక్ష సైతం అనుభవించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment