తెలంగాణ తల్లి!
ఇంతకీ.. ఏ
● పాత విగ్రహమా.. కొత్త రూపమా..? ● వన్‌టౌన్ కూడలిలో ఏర్పాటు కానున్న విగ్రహం ● కొత్త తెలంగాణ తల్లివైపే బల్దియా మొగ్గు
కరీంనగర్ వన్‌టౌన్ చౌరస్తాలో
కొనసాగుతున్న తెలంగాణ తల్లి విగ్రహ పనులు
కరీంనగర్ కార్పొరేషన్:
నగరంలోని వన్‌టౌన్ పోలీసుస్టేషన్ కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు విషయంలో ఆసక్తి రేపుతోంది. గతంలో ఉన్నట్లుగా పాత విగ్రహం ఏర్పాటు చేస్తారా..? కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త రూపుతో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టిస్తారా..? అనే చర్చ మొదలైంది. ఈ కూడలిలో మాజీ ఎంపీ జువ్వాడి చొక్కారావు విగ్రహం, మరో పక్క తెలంగాణ తల్లి విగ్రహం ఉండేవి. గత ప్రభుత్వ హయాంలో కూడలి అభివృద్ధిలో భాగంగా, ఈ రెండు విగ్రహాలు తొలగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చొక్కారావు విగ్రహం ఏర్పాటు చేయగా, తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సి ఉంది.
కూడలి ఆధునీకరణతో విగ్రహాల తొలగింపు
స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలోని కూడళ్లను ఆధునీకరించారు. వన్‌టౌన్ పోలీసుస్టేషన్ ఎదురుగా ఉన్న కూడలిని అభివృద్ధి పరిచేందుకు అప్పటికే ఉన్న రెండు విగ్రహాలను తొలగించారు. ఇతర కూడళ్లతో పాటు గత ప్రభుత్వ హయాంలోనే ఈ కూడలి పనులు పూర్తి కావాల్సి ఉంది. కాంట్రాక్టర్ జాప్యంతో కూడలి ఆధునీకరణలో ఆలస్యం చోటుచేసుకుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, కూడలిని ఆధునీకరణ పనులు పూర్తి చేసి చొక్కారావు విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేశారు. అయితే అప్పటి నుంచి కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాట చేస్తారా లేదా అనే సందిగ్దత నెలకొంది. కాగా ఇదే కూడలిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నగరపాలకసంస్థ అధికారులు తాజాగా నిర్ణయించారు.
కొత్త విగ్రహమేనా?
రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ తల్లి విగ్రహ రూపుపై వివాదం నడుస్తుండడం తెలిసిందే. హైదరాబాద్‌లోని సచివాల యం ఎదుట కొత్తరూపుతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించగా, బీఆర్‌ఎస్ అభ్యంతరాల నేపథ్యంలో తెలంగాణ తల్లి విగ్రహంపై ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఈ నేపథ్యంలో నగరంలోని వన్‌టౌన్ కూడలిలో ఏర్పాటు చేయబోయే తెలంగాణ తల్లి విగ్రహం ఏ రూపుతో ఉండబోతుందనేది ప్రస్తుతం నగరంలో హాట్‌టాపిక్‌గా మారింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ఉన్నట్లుగా పాత విగ్రహం ఏర్పాటు చేస్తారా లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా అనే ఆసక్తి రాజకీయవర్గాల్లో నెలకొంది. అయితే తెలంగాణ తల్లి విగ్రహం రూపు మారిన తరువాత ఏర్పాటు చేయాల్సి వస్తుండడంతో, కొత్త రూపుతో వచ్చిన తెలంగాణ తల్లి విగ్రహాన్నే ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో కొత్త రూపుతో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహ తయారీకి ఆర్డర్ కూడా ఇవ్వనున్నట్లు తెలిసింది. ఏదేమైనా పాత విగ్రహం స్థానంలో కొత్త విగ్రహంతో పాటు, కొత్త రూపుతో ఉన్న తెలంగాణ తల్లి ఏర్పాటు కానుండడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment