నాణ్యమైన బోధన
రుచికరమైన భోజనం..
గురుకులం పిలుస్తోంది
● ఐదో తరగతిలో ప్రవేశాలు షురూ
● ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ
● ఫిబ్రవరి 1 వరకు గడువు
● ఉమ్మడి జిల్లాలో 23 గురుకులాలు.. 1,840 సీట్లు
కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గురుకుల విద్యాలయాల్లో 2025–26 విద్యా సంవత్సరానికి ఐదో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కేజీ టు పీజీ మిషన్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉచితంగా కార్పొరేట్ విద్య అందించడం లక్ష్యంగా రాష్ట్రప్రభుత్వం ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధన చేస్తోంది. అయితే, ఉమ్మడి ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
ఉమ్మడి జిల్లాలో 23 గురుకులాలు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 23 గురుకులాలు ఉన్నాయి. ఇందులోని ఐదో తరగతిలో 1,840 సీట్లు ఉన్నాయి. కరీంనగర్, జగిత్యాలలో ఐదేసి, పెద్దపల్లిలో 6, రాజన్న సిరిసిల్లలో 7 గురుకులాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో చింతకుంట, హుజూరాబాద్, జమ్మికుంట, మానకొండూర్, పెద్దపల్లి జిల్లాలో మంథని, గోదావరిఖని, రామగుండం, నందిమేడారం, జగిత్యాల జిల్లాలో మేడిపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి, జగిత్యాల, గొల్లపల్లి, మల్లాపూర్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో బద్దెనపల్లి, వేములవాడ, చిన్నబోనాల, బోయినపల్లి, ముస్తాబాద్, నర్మాల, ఇల్లంతకుంటలో గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈనెల 21న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమయ్యాయి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల గరిష్ట వయసు సడలింపు ఇచ్చారు. గ్రామీణ విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.1.50 లక్షలు, పట్టణవాసులైతే రూ.2 లక్షలకు మించరాదు.
ఒక్కో గురుకులంలో 80 సీట్లు..
ఐదో తరగతిలో ఒక్కో గురుకులంలో 80 సీట్ల చొప్పున మొత్తం 23 గురుకులాల్లో 1,840 సీట్లు కేటాయించారు. నాణ్యమైన విద్యాబోధనతోపాటు, రుచికరమైన భోజనం, వసతి ఉన్నాయి. ఎస్సీలకు 65, ఎస్టీ, బీసీ ,మైనార్టీ, ఓసీలకు 15 సీట్ల చొప్పున కేటాయించారు. ఐదో తరగతిలో ప్రవేశం పొందితే పన్నెండో తరగతి వరకు ఉచితంగా చదువు, హాస్టల్ వసతి తదితర సౌకర్యాలు ఉంటాయి. దుస్తులు, పుస్తకాలు ఉచితంగా అందించడంతోపాటు కాస్మోటిక్ చార్జీలు కూడా ప్రభుత్వమే ఇస్తుంది.
ఒకటి వరకు గడువు
ఐదో తరగతిలో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది అక్టోబరు ఒకటో తేదీ వరకు దరఖాస్తు దాఖలు చేయాలి. ఇందుకోసం (http://ttwreis.in,http://tgcet. cgg.gov.in,http:/tgtwgurukulam. telangana. gov.in,http:/mjptbcwreis.telangana.gov.in) వెబ్‌సైట్‌ను సంప్రదించాలి. రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఒక ఫోన్‌నంబరుతో ఒకే దరఖాస్తు చేయాలి. 2024లో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులే అర్హులు. ప్రవేశ పరీక్షను ఫిబ్రవరి 23న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తారు.
దరఖాస్తుకు ఇవి అవసరం..
విద్యార్థులు దరఖాస్తుతో ఈ ధ్రుపత్రాలు జతచేయాలి. స్కూల్ బొనోఫైడ్‌లోని పుట్టిన తేదీ ధ్రువీకరణపత్రం, సొంత మొబైల్ నంబర్, విద్యార్థి ఆధార్, కులం, ఆదాయం, పాఠశాల చిరునామా, విద్యార్థి ఫొటో, ప్రస్తుతం చదువుతున్న జిల్లా పేరు జతచేయాలి.
మెనూ ఇదీ..
గురుకులాల్లో మెనూకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. వారానికి నాలుగు రోజులు కోడిగుడ్డు, ఆరు రోజులు పండ్లు, ఒకటి, మూడు, ఐదో ఆదివారాల్లో చికెన్, రెండు, నాలుగో ఆదివారాల్లో మటన్, ప్రతీరోజు నెయ్యి వడ్డిస్తారు. అదేవిధంగా రోజూ సాయంత్రం లేదా రాత్రి భోజన సమయంలో స్నాక్స్, ప్రతీరోజు పాలు, వారంలో కనీసం నాలుగైదు రకాల ఆకుకూరలు, ఎనిమిది రకాల కూరగాయలతో కూరలు, ప్రతీ శనివారం స్వీటు ఇస్తారు
పేదలకు వరం
గురుకుల విద్యాలయాలు పేద విద్యార్థులకు వరం. పౌష్టికాహారంతో కూడిన భోజనం అందడంతో రుగ్మతలు దూరమవుతాయి. ఇంగ్లిష్ మీడియం విద్యాబోధనతో వివిధ పోటీ పరీక్షల్లో సులభవంగా ఉత్తీర్ణత సాధించవచ్చు.
– కె.ప్రత్యూష, గురుకులాల జోనల్ ఆఫీసర్
Comments
Please login to add a commentAdd a comment