జగిత్యాలజోన్: మహిళను హత్య చేసిన కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్షతోపాటు రూ.25వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.నీలిమ సోమవారం తీర్పు చెప్పారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జంగిలి మల్లికార్జున్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కనుక మధునవ్వకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కూతురు లతను 12 ఏళ్ల క్రితం వెల్గటూర్ మండలం పాతగూడురు గ్రామానికి చెందిన రెడ్డపాక దేవయ్యకిచ్చి వివాహం చేశారు. వీరికి ఒక కుమార్తె. భర్త దేవయ్య ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లడంతో.. లత తన కూతురితో ఉంటోంది. ఇదే గ్రామానికి చెందిన బోయిన రమేశ్.. లత ఇంటికి అప్పుడప్పుడు వచ్చి పోతుండేవాడు. జనవరి 01, 2021న రాత్రి 11 గంటల సమయంలో లత ఇంటికి వెళ్లిన రమేశ్ ఆమెతో గొడవపడి కొట్టాడు. లతకు తీవ్ర రక్తస్రావమై అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చిన్నారి పత్తిపాకలో ఉంటున్న అమ్మమ్మకు ఫోన్ చేయడంతో.. వారు వచ్చి చూసేసరికి లత చనిపోయి ఉంది. మృతురాలి తల్లి మధునవ్వ వెల్గటూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అప్పటి ఎస్‌ఐ కె.ప్రేమ్‌కుమార్ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐలు కె.కిశోర్, ఎ.రాంచందర్‌రావు, బి.కోటేశ్వర్ నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో చార్జీషీట్ దాఖలు చేశారు. కోర్టు మానిటరింగ్ అధికారులు ఎం.కిరణ్‌కుమార్, వి.శ్రీధర్ బలమైన సాక్ష్యాలను కోర్టులో ప్రవేశపెట్టడంతో.. రమేశ్‌కు యావజ్జీవ శిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment