![జీజీహెచ్‌లో తప్పిన భారీ ప్రమాదం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/11/10gdk101-180104_mr-1739214693-0.jpg.webp?itok=nccXRvKH)
జీజీహెచ్‌లో తప్పిన భారీ ప్రమాదం
● యాష్ ట్యాంకర్ తగిలి విరిగిపడిన విద్యుత్ స్తంభాలు
● ఆటో ధ్వంసం
కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్)లో సోమవారం జరిగిన ప్రమాదంతో నాలుగు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. వందలాంది మంది పేషెంట్లు, వారి బంధువులు, వైద్యులు, ప్రొఫెసర్లు, నర్సింగ్ సిబ్బంది, మెడికోల రాకపోకలతో నిత్యం బిజీగా ఉండే ప్రాంతంలో జరిగిన ప్రమాదంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. స్థానికులు, విద్యుత్ శాఖ అధి కారులు తెలిపిన వివరాలు.. ఆస్పత్రి ఆవరణలో కొత్తగా నిర్మిస్తున్న 355 అదనపు పడకల ఆస్పత్రి భవనం కోసం భారీ యాష్ ట్యాంకర్ వాహనం యాష్‌ను అన్లోడ్ చేసి బయటకు వస్తుండగా, ఆస్పత్రి స్ట్రీట్‌లైట్ల కోసం కేటాయించిన విద్యుత్ వైర్లు వాహనానికి చిక్కుకున్నాయి. దీంతో ఒక్కసారిగా నాలుగు స్తంభాలు విరిగి కిందపడ్డాయి. మార్చురీ సమీపంలోని ఆటోస్టాండ్ ముందు రోడ్డుపక్కన పార్కింగ్ చేసి ఉన్న పరుశరాంకు చెందిన ఆటోపై స్తంభం పడడంతో ఆటో ధ్వంసం అయింది. సుమారు రూ.30వేల నష్టం జరిగిందని బాధిడుతు ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పటి వరకు ఇదే ఆటోలో కూర్చొని మాట్లాడుకున్న ముగ్గురు డ్రైవర్లు, ఘటనకు 5 నిమిషాల ముందు టీ తాగడానికి ఆస్పత్రిలోని క్యాంటిన్‌కు వెళ్లారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తెలిగిన విద్యుత్ వైర్ల ద్వారా ఎవరికై నా షాక్ తగిలినా, ఎవరిపైనా స్తంభం పడినా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. కాగా, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను తప్పించే ప్రయత్నంలో ఈ ప్రమాదం జరిగిందని యాష్ ట్యాంకర్ డ్రైవర్ చెబుతున్నాడని, ప్రమాదానికి కారణమైన వాహనాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తమ ఆధీనంలో ఉంచుకున్నామని విద్యుత్ శాఖ ఏఈ సంపత్ తెలిపారు. విరిగిన స్తంభాలు, వైర్ల నష్టం సుమారు రూ.50వేల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, భవన నిర్మాణ పనులు చేపడుతున్న కాంట్రాక్టరు రాజీ కుదుర్చుకోవడానికి అధికారులతో మంతనాలు జరుపుతున్నారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment