![‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/11knt253-180090_mr-1739299825-0.jpg.webp?itok=ZKNyiFnt)
‘స్థానిక’ ఎన్నికలకు సన్నద్ధం
● పోలింగ్ కేంద్రాల ఏర్పాటు ● ఓటరు ముసాయిదా విడుదల ● ఈ నెల 15న తుది జాబితా ● జిల్లాలో 318 గ్రామాలు.. ఓటర్లు 5,08,489 మంది
కరీంనగర్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికలు పకడ్బందీగా జరపాలని ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల మేరకు కసరత్తు ముమ్మరం చేశారు. కరీంనగర్ జిల్లా ప్రజాపరిషత్ పరిధిలో 15 జెడ్పీటీసీ, 15 ఎంపీపీ, 170 ఎంపీటీసీ స్థానాలున్నాయి. అలాగే, గ్రామ పంచాయతీలు 318, వార్డులు 2,962 ఉండగా 2,962 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి, ఓటరు ముసాయిదా జాబితా సైతం విడుదల చేశారు. దీని ప్రకారం.. జిల్లాలో 5,87,285 జనాభా ఉండగా 5,08,489 ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలకు అనుగుణంగా రిటర్నింగ్ అధికారులను నియమించారు. మండల స్థాయిలో ఎన్నికల పర్యవేక్షకులుగా జిల్లాలోని వివిధ అధికారులను నియమిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రం, అందులో ఉండాల్సిన బూత్‌ల సంఖ్యపై కసరత్తు చేస్తున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీల వారీగా బ్యాలెట్ పత్రాల ద్వారా స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు బ్యాలెట్ బాక్స్‌లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులతో జరుగుతాయి. ఈ నెల 15 వరకు మొత్తం ప్రక్రియ పూర్తి చేసి, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కలెక్టర్ ద్వారా నివేదిక పంపించాల్సి ఉంటుంది. ఈ మేరకు జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రత్యేకంగా ఎన్నికల విభాగం ఏర్పాటు చేసి, పర్యవేక్షిస్తున్నారు.
పంచాయతీల వారీగా ఓటరు జాబితా..
సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల కోసం ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటరు జాబితా తయారు చేశారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని, అదనంగా వచ్చిన ఓటర్ల సంఖ్యను కలుపుకొని, మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితా ప్రకటించారు.
రిటర్నింగ్ అధికారులు వీరే..
ఎన్నికల నిర్వహణకు గానూ 15 మండలాలకు రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ కలెక్టర్ పమేలా సత్పతి ఉత్తర్వులు జారీ చేశారు. చిగురుమామిడి మండలానికి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి కె.వేణుగోపాల్‌రావు, చొప్పదండికి జిల్లా ఎంప్లాయీమెంట్ అధికారి తిరుపతిరావు, ఇల్లందకుంటకు జిల్లా హార్టికల్చర్, సెరికల్చర్ ఆఫీసర్ ఆర్.శ్రీనివాస్‌రావు, గంగాధరకు జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ పి.పవన్‌కుమార్, గన్నేరువరానికి జిల్లా కో–ఆపరేటివ్ ఆఫీసర్ ఎస్.రామాంజనేయచారి, హుజూరాబాద్‌కు ఏడీ అగ్రికల్చర్ జి.సునీత, జమ్మికుంటకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్‌ప్రకాశ్, కరీంనగర్‌రూరల్‌కు ఏడీఏ పి.మహేశ్, కొత్తపల్లికి ఏడీ అగ్రికల్చర్ కె.రణధీర్‌కుమార్, మానకొండూర్‌కు డీఆర్‌డీవో వి.శ్రీధర్, రామడుగుకు జిల్లా బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్ ఎం.అనిల్ ప్రకాశ్ కిరణ్, వి.సైదాపూర్‌కు జిల్లా వ్యవసాయాధికారి జి.భాగ్యలక్ష్మి, శంకరపట్నంకు డీసీఎస్‌వో నర్సింగరావు, తిమ్మాపూర్‌కు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎస్.నాగార్జున, వీణవంకకు ఏడీ ఫిషర్స్ విజయభారతి నియమితులయ్యారు.
అభ్యంతరాలు.. సమావేశం
ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు ఫిర్యాదులు, అభ్యంతరాల స్వీకరణ
13న రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం
14న అభ్యంతరాలు, సూచనల పరిశీలన. అదేరోజు కలెక్టర్ నుంచి అనుమతి
15న ఓటరు, పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల
Comments
Please login to add a commentAdd a comment