ఆర్టీసీ బస్సులోకి దూసుకెళ్లిన కారు
కర్ణాటక: ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. ఈ దుర్ఘటన మండ్య జిల్లా నాగమంగల తాలూకా ఆదిచుంచనగిరి ఆస్పత్రి ఎదురుగా బెంగళూరు–మంగళూరు జాతీయ రహదారి–75పై బుధవారం ఉదయం జరిగింది. తాలూకాలోని బెళ్లూరు క్రాస్ సమీపంలోని రోడ్డుపై ఆదిచుంచనగిరి ఆస్పత్రి ఎదురుగా ఆగి ఉన్న కేఎస్‌ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బెంగళూరు నివాసులైన బెండిగానహళ్లి నమిత, ఇన్ఫోసిస్ ఉద్యోగి, రాజస్తాన్‌వాసి పంకజ్‌శర్మ, హోసకోటెకు చెందిన వంశీకృష్ణ, ధారవాడకు చెందిన రఘునాథ్ భజంత్రి మరణించారు. వీరందరూ 30–35 ఏళ్ల మధ్యవారు.
బస్సులోకి దూసుకెళ్లిన కారు
ప్రయాణికుల కోసం బస్సు నిలిచి ఉండగా హాసన్ వైపు నుంచి వచ్చిన ఈ స్విఫ్ట్ కారు ఢీ కొట్టింది. కారు డ్రైవర్ అదుపు తప్పడం కారణం. వేగం ధాటికి కారు ముందు సగ భాగం బస్సు లోపలకి చొచ్చుకుని పోయింది. కారులో ఉన్న ఒక మహిళ, ముగ్గురు పురుషులు అక్కడికక్కడే మరణించారు. బస్సులో ఎవరికీ గాయాలు కాలేదు. బెళ్లూరు పోలీసులు చేరుకుని పరిశీలించారు. కారును వెలికితీసి మృతదేహాలను బయటకు తీయడానికి శ్రమించాల్సి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment