కొనసాగుతున్న వీఏఓల ధర్నా
హొసపేటె: వివిధ డిమాండ్ల సాధన కోసం జిల్లాధికారి కార్యాలయం ఎదుట రాష్ట్ర గ్రామ పరిపాలన అధికారుల(వీఏఓల) కేంద్ర సంఘం సోమవారం నిరవధిక ధర్నాకు దిగింది. శాఖ రూపొందించిన 21కి పైగా మొబైల్ వెబ్ సాఫ్ట్‌వేర్‌లు తమ విధులను నిర్వర్తించాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నాయి. ఈ సాఫ్ట్‌వేర్‌ల నిర్వహణకు అవసరమైన మొబైల్, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్, స్కానర్ అందజేయకుండా వీఏఓలు విధులు నిర్వహించాలని ఒత్తిడి తెస్తున్నారని వాపోయారు. రెవెన్యూ శాఖ మూడేళ్ల సర్వీసును పరిగణనలోకి తీసుకొని అంతర్ జిల్లాల బదిలీలకు కొత్త మారదర్శకాలు రూపొందించాలన్నారు. కమిషన్ పరిధిలో వీఏఓల సీనియారిటీని రాష్ట్ర స్థాయి సీనియారిటీగా పరిగణించాలన్నారు. మొబైల్ సాఫ్ట్‌వేర్ పనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న అన్ని సస్పెన్షన్‌లను వెంటనే రద్దు చేయాలి, ఆర్డర్‌ను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రయాణ భత్యాన్ని రూ.500కి బదులుగా రూ.3000కి పెంచాలని తదితర డిమాండ్ల సాధన కోసం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వీఏఓలకు అన్ని వసతులతో కూడిన కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, నాణ్యమైన ఫర్నిచర్, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని, కాంబినేషన్, ఈ–ఆఫీస్, గరుడ, భూమి, నవోదయ, దిశాంక్ తదితర సాఫ్ట్‌వేర్‌ల నిర్వహణకు మరిన్ని డేటా సామర్థ్యం గల స్టార్ట్ ఫోన్‌లను అందించాలని కోరారు. వీఏఓల సంఘ జిల్లా అధ్యక్షుడు యంకారెడ్డి, ప్రధాన కార్యదర్శి సి.గురుబసవరాజు, ఉపాధ్యక్షుడు వీరేష్, తాలూకా అధ్యక్షుడు రవిచంద్ర గొగ్గ, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జి.మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment