హాసనాంబ ఆలయం మూత
దొడ్డబళ్లాపురం: హాసన్‌లోని ప్రముఖ హాసనాంబ దేవాలయంలో దర్శనోత్సవాలు ముగిశాయి. ఏడాదికి ఒకసారి మాత్రమే దర్శన భాగ్యం లభించే హాసనాంబ దేవాలయం ఆదివారంనాడు మూతబడింది. వేదపండితులు శాస్త్రోక్తంగా దేవాలయం తలుపులు మూసివేశారు. ఈ ఏడాది దర్శన దినాల్లో 18 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ప్రత్యేక దర్శనం టికెట్లు,లడ్డు,దేవి వస్త్రాల విక్రయాలతో మొత్తంగా రూ.8 కోట్ల ఆదాయం వచ్చింది. శనివారం రాత్రి సిద్ధేశ్వరస్వామి రథోత్సవం జరిగింది.
అమ్మవారికి గంధశోభ
బొమ్మనహళ్లి: కార్తీక మాసం సందర్భంగా ఆదివారం నగరంలోని బొమ్మనహళ్ళి హెచ్‌ఎస్‌ఆర్ లేఔట్ పరంగిపాళ్యలో గ్రామదేవత మారెమ్మ దేవికి శ్రీగంధంతో అలంకరించారు. అర్చకులు దీక్షిత్ అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, వివిధ పుష్పాలతో శ్రీగంధంతో అలంకరించారు. మహిళా భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
కార్ల దొంగల పట్టివేత
సాక్షి, బెంగళూరు: విలువైన కార్లను దొంగతనం చేస్తున్న మగ్గురు ఖతర్నాక్ దొంగలను బెంగళూరు అన్నపూర్ణేశ్వరి నగర పోలీసులు అరెస్టు చేశారు. రాజస్తాన్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఈ దొంగలు ఖరీదైన కార్లను లక్ష్యంగా చేసుకుని మాయం చేసేవారు. సాఫ్ట్‌వేర్ హ్యాక్ చేసి కార్ల తలుపులను తెరిచి సులభంగా వాటిని ఎత్తుకెళుతున్నారు. వీరిని పోలీసులు విచారించగా బెంగళూరుతో పాటు పలు ప్రాంతాల్లో కార్ల దొంగతనం చేసినట్లు నిందితులు అంగీకరించారు. కాగా, ఈ కేటుగాళ్లు బెంగళూరుకు విమానాల్లో వచ్చి కార్లను చోరీ చేసి తీసుకెళ్లేవారని తెలిసింది.
గోళూరు గణనాథా నమోస్తుతే
తుమకూరు: చరిత్ర ప్రసిద్ధి చెందిన గోళూరు మహాగణపతి మూర్తికి బలిపాడ్యమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా లంబోదరునికి వివిధ నైవేద్యాలను సమర్పించి అర్చనలు చేశారు. బలిపాడ్యమి నుంచి నెల రోజులపాటు ఏకదంతున్ని అలాగే ఉంచుతారు. భక్తులు వచ్చి పూజలు నిర్వహించుకోవచ్చు. కార్తీక మాసమంతా స్వామివారికి ప్రత్యేక పూజలు కొనసాగుతాయి. రోజు రాత్రి సుమారు 9 గంటలకు స్వామివారికి మహా మంగళహారతి సాగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment