రూ.50 కోట్ల ఆఫర్‌పై దర్యాప్తు జరపాలి
మైసూరు: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎమ్మెల్యేలకు బీజేపీ వారు తలా రూ.50 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు చేసిన ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో దర్యాప్తు జరిపించాలని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు సవాల్ విసిరారు. శుక్రవారం ఆయన నగరంలోని చాముండిబెట్టను సందర్శించి నాడశక్తి దేవత చాముండేశ్వరిని దర్శించుకున్నారు. చెన్నపట్టణ ఎన్నికల్లో తనయుడు నిఖిల్ గెలవాలని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం ప్రతి విషయంపై సిట్‌తో దర్యాప్తు చేయిస్తున్నట్లుగానే ఈ ఆఫర్‌పై కూడా దర్యాప్తు జరిపిస్తే అన్ని వాస్తవాలు బయటపడతాయన్నారు. ముడా, వాల్మీకి కుంభకోణం కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సీఎం.. ఇప్పుడు ఇలాంటి ఆరోపణలు చేసి ప్రజల్లో గందరగోళం సృష్టించి ఈడీ దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు కుట్ర పన్నుతున్నారని మండిపడ్డారు. మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్, తన మధ్య ఉన్న స్నేహం కేవలం రాజకీయపరమైనదే తప్ప వ్యక్తిగతమైంది కాదన్నారు. తానెప్పుడూ జమీర్ అహ్మద్‌ను కుళ్ల అని సంభోదించలేదన్నారు. అసభ్యకరంగా మాట్లాడిన వారిపై ఎన్నో కేసులు పెట్టి జైలుకు పంపిన ప్రభుత్వం ఇప్పుడు మంత్రి జమీర్ విషయంలో మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. చెన్నపట్టణ ఉప ఎన్నికల్లో ప్రజలు తమ వైపే ఉన్నారన్నారు. మాజీ మంత్రి సారా మహేష్, ఎమ్మెల్సీ సీఎన్ మంజేగౌడ, మాజీ ఎమ్మెల్యే ఎం.అశ్విన్‌కుమార్ పాల్గొన్నారు.
కొనసాగిన కుమార, ఎమ్మెల్యే దేవెగౌడ దూరం
చెన్నపట్టణ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసినా కేంద్ర మంత్రి, జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి, జేడీఎస్ కోర్ కమిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మధ్య దూరం కొనసాగింది. నగరంలోని జలదర్శిని అతిథిగృహంలో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రగతి పరిశీలన సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ చాముండిబెట్టను కేంద్రమంత్రి కుమారస్వామి సందర్శించినప్పుడు అక్కడెక్కడా కనిపించలేదు. మరో వైపు కర్ణాటక రాష్ట్ర గిరిజన పరిశోధన సంస్థలో జరిగిన కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సి ఉన్నా గైర్హాజరయ్యారు.
కేంద్ర మంత్రి కుమారస్వామి డిమాండ్
Comments
Please login to add a commentAdd a comment