బెళగావి ఎస్పీ పేరుతో నకిలీ ఖాతా
దొడ్డబళ్లాపురం: బెళగావి ఎస్పీ భీమాశంకర్ గుళేద పేరుతో ఫేక్ ఎఫ్‌బీ అక్కౌంట్లు తెరిచి డబ్బు వసూలు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన విజయ్‌కుమార్, రాజస్థాన్‌కు చెందిన అర్బాజ్ ఖాన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు ప్రముఖ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ఫేస్‌బుక్ అక్కౌంట్లను నకిలీవి తెరిచి అమాయకులను సంప్రదించి ఏదోరకంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. వలలో పడి మోసపోయిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బెళగావి పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.
ఈశ్వరప్పపై సుమోటో కేసు
శివమొగ్గ: సమాజంలో అశాంతిని ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి కేఎస్ ఈశ్వరప్పపై నగరంలోని జయనగర స్టేషన్ పోలీసులు గురువారం సుమోటో కేసు నమోదైంది. ఇన్‌స్పెక్టర్ సిద్దేగౌడ ఫిర్యాదు మేరకు ఐపీసీ 196(1), 299ల ప్రకారం ఈశ్వరప్పపై నానాబెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది.
చేసిన వ్యాఖ్యలేంటి?
ఈనెల 13న ఈశ్వరప్ప వక్ఫ్ బోర్డు వివాదం గురించి మాట్లాడుతూ రైతుల పొలాలు, పాఠశాలలు, కాలేజీలు, పురాతత్వ శాఖలతో పాటు సర్ ఎం.విశ్వేశ్వరయ్య జన్మించిన గ్రామాన్ని కూడా వక్ఫ్ ఆస్తి అని ప్రకటిస్తున్నారని, ఈ విషయంపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించడం లేదని ఆరోపించారు. అదేవిధంగా కాంట్రాక్టు పనుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, వారు హిందుస్థాన్‌ను పాకిస్థాన్ చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించారు. ఇది ఇలానే కొనసాగితే సాధువులు, సంతుల నేతృత్వంలో తిరుగుబాటు తలెత్తే రోజులు ఎంతో దూరంలో లేవని, కాంగ్రెస్ వారిని గాలించి కొట్టి చంపే రోజులు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదని వ్యాఖ్యానించారు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అభియాన్
● ప్రకటించిన బసనగౌడ పాటిల్ యత్నాళ్
శివాజీనగర: రాష్ట్ర బీజేపీలో వర్గ రాజకీయం మళ్లీ తెరపైకి వచ్చింది. వక్ఫ్‌కు విరుద్ఢంగా రాష్ట్రాధ్యక్షుడు బీ.వై.విజయేంద్ర వ్యతిరేక వర్గం జనజాగృతి అభియాన్ చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాళ్, మాజీ మంత్రులు అరవింద లింబావలి, రమేశ్ జార్కిహొళి తదితరులు బెంగళూరులోని సదాశివనగరలో ఉన్న కుమార బంగారప్ప ఇంటిలో సమావేశమయ్యారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 25 వరకు వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జనజాగృతి అభియాన్ నిర్వహించనున్నట్లు వారు విలేకరులకు తెలిపారు. ఇది బీదర్ నుంచి ప్రారంభమై కల్బుర్గి, విజయనగర, యాదగిరి, బాగలకోట, బెళగావివరకు కొనసాగుతుందని ప్రకటించారు. ఈ అభియాన్ అనంతరం ప్రజాభిప్రాయాన్ని జేపీసీకి సమర్పిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment