వెంటాడిన తుపాను
● వానలతో బెంగళూరువాసుల సతమతం
బనశంకరి: గత మూడు నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం మంగళవారం కూడా ఓ మోస్తరుగా కొనసాగింది. బెంగళూరువ్యాప్తంగా జల్లువానలు పడి రోడ్లు జలమయం అయ్యాయి. జనం తడుస్తూనే దైనందిన కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఫెంగల్ తుపాన్ ప్రభావంతో దంచికొడుతున్న కుండపోత వానలు, దీనికి తోడు చలిగాలులతో నగరవాసులు హడలిపోయారు. మంగళవారం ఉదయం నుంచి కొన్నిచోట్ల వానలు తగ్గాయి. కానీ సాయంత్రం మళ్లీ ఊపందుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
జిల్లాల్లో విద్యాలయాలకు సెలవు
రామనగర, మండ్య, చిక్కబళ్లాపుర, చామరాజనగర తో పాటు దక్షిణ వలనాడులోని కొన్ని ప్రాంతాల్లో పాఠశాల కాలేజీలకు మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. బెంగళూరు నగర జిల్లాలో సెలవు ప్రకటించకపోగా, బెంగళూరు గ్రామాంతర జిల్లాలో ఎక్‌కేజీ, యుకేజీ, అంగన్‌వాడీలకు మాత్రమే సెలవు ఇచ్చారు. మలెనాడు ప్రాంతంలో మేఘావృతమైంది. బుధవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశముంది.
పంటలు నేలపాలు
తుపాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో వరి, రాగి సహా అనేక పంటలు దెబ్బతిని అన్నదాతలు ఆవేదనకు గురయ్యారు. వరి, రాగిల కోత సమయంలో విపత్తు ఎదురైంది. పైరు నేలకరవడంతో చేతికి వచ్చిన పంట నోటికి అందలేదని రైతులు వాపోయారు.
కుంగిన హైవే
తుపాను వర్షాలకు మంగళూరు– ఉడుపి జాతీయ రహదారి కూళూరు వద్ద కుంగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పెద్ద గుంత ఏర్పడి నీరు నిలిచిపోయింది. పెద్ద వాహనాలు వెళ్లలేకుండా అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment