దివ్యాంగులను ప్రోత్సహించాలి
మైసూరు: దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. దివ్యాంగులు ఎందులోను తక్కువ కారని, ప్రోత్సహిస్తే వారు కూడా అద్భుతాలు చేయగలుగుతారని వక్తలు పేర్కొన్నారు. పలువురు విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. బాలల వైవిధ్య వేషధారణ పోటీలు అలరించాయి. మైసూరు వర్సిటీ పీజీ విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
పేలిన సిలిండర్,
తల్లీ పిల్లలకు గాయాలు
దొడ్డబళ్లాపురం: గ్యాస్ సిలిండర్ పేలి తల్లీ ముగ్గురు పిల్లలు తీవ్రంగా గాయపడి, ఆస్తినష్టం జరిగిన దుర్ఘటన దక్షిణ కన్నడ జిల్లా ఉళ్లాల తాలూకా ఖండిక గ్రామంలో జరిగింది. శనివారం రాత్రి ఖుబ్రా, ఆమె పిల్లలు భోజనం చేసి నిద్రపోయారు. కొంత సేపటికి వంట గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. దీంతో ఇంటి పైకప్పు లేచిపోయి వస్తువులన్నీ కాలిపోయాయి. తల్లీ పిల్లలు నిద్రపోతున్న మంచం, బీరువా, ఇతర వస్తువులు మంటల్లో చిక్కుకున్నాయి. నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు కాపాడి దేరళకట్టె ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ పుట్టరాజు, పోలీసులు ఆదివారం ఉదయం ఇంటిని పరిశీలించారు.
ఈశ్వరప్పపై సీఐ ఫిర్యాదు
శివమొగ్గ: మాజీ డీసీఎం, బీజేపీ రెబెల్ నేత కే.ఎస్. ఈశ్వరప్ప మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇతర మతాలకు వ్యతిరేకంగా, రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేశారని శివమొగ్గ నగరంలోని కోటె ఠాణా సీఐ కే.హరీష్ సుమోటోగా ఫిర్యాదు చేశారు. దీంతో కోటె పోలీసులు ఈశ్వరప్పపై కేసు నమోదు చేశారు. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడులు, ఆలయాలు, ఆస్తుల విధ్వంసాన్ని ఖండిస్తూ డిసెంబర్ 3వ తేదీన శివమొగ్గలోని బాల్‌రాజ్ అరసు రోడ్డులో హిందూ రక్షణ కమిటి, విశ్వహిందు పరిషత్‌లు ఆందోళన నిర్వహించాయి. ఇందులో ఈశ్వరప్ప ప్రసంగిస్తూ రెచ్చగొట్టేలా మాట్లాడారని సీఐ ఫిర్యాదు చేశారు.
భక్తిశ్రద్ధలతో షష్టి పూజలు
మండ్య: సుబ్రమణ్య షష్టి సందర్భంగా జిల్లాలోని పాండవపుర పట్టణంతో పాటు తాలూకావ్యాప్తంగా ప్రజలు సుబ్రమణ్య స్వామి దేవస్థానాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. పుట్టలకు పాలు, నెయ్యి పోశారు. పట్టణంలోని సుబ్రమణ్యస్వామి ఆలయంలో
జాతర జరిపారు. డింకా గ్రామ సమీపంలోని సుబ్రమణ్య స్వామి ఆలయంలో కూడా జాతర మహోత్సవం జరిగింది. పాండవపుర, కేఆర్‌పేటె తాలూకాల్లోని చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు తరలి వచ్చి పూజలు చేశారు.
ఖాకీలకు సాంకేతిక
శిక్షణ: ఏడీజీపీ
దొడ్డబళ్లాపురం: సైబర్, ఇతర నేరాలను అరికట్టే దిశలో బెంగళూరు పోలీసులకు జర్మన్ టెక్నాలజీ ఆధారిత శిక్షణనిస్తామని ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. బెంగళూరులోని ఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇప్పుడు నేరస్తులు టెక్నాలజీ సాయంతో కొత్త రకం నేరాలకు పాల్పడుతున్నాని చెప్పారు. వీటిని అరికట్టాలంటే పోలీసులు కూడా సాంకేతికతో ముందుడాలన్నారు. ఇంతకు ముందు దోపిడీలు, దొంగతనాలు జరిగేవని, ఇప్పుడు ప్రపంచంలో ఏ మూల నుంచయినా నేరస్తులు దోపిడీలకు పాల్పడుతున్నారని సైబర్ నేరాలను ఉదాహరించారు. దీంతో పోలీసులకు ఒక ఏడాది పాటు సైబర్ క్రైం, మహిళలపై అఘాయిత్యాల కేసులు, పోక్సో కేసుల్లో విచారణ గురించి, ఏఐ, డ్రోన్ల వాడకం, డ్రగ్స్ నియంత్రణ తదితర అంశాల్లో తర్ఫీదునివ్వనున్నట్లు చెప్పారు. ఇందుకోసం ప్రైవేటు కంపెనీతో కలిసి సైబర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment