విశిష్ట నేతకు కన్నీటి వీడ్కోలు
శివాజీనగర: మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర దేశ రాజకీయాలలో విశిష్ట నేత ఎస్.ఎం.కృష్ణకు కుటుంబం, అశేష అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. మండ్య జిల్లాలో సొంతూరిలో అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరిగాయి. 92 ఏళ్ల ఎస్‌ఎం కృష్ణ మంగళవారం తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర నివాసంలో మరణించడం తెలిసిందే. బుధవారం ఉదయం ఆయన పార్థివదేహాన్ని ప్రత్యేక వాహనంలో బెంగళూరు నుంచి మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలో సొంతూరు సోమనహళ్ళికి బృహత్ ఊరేగింపుగా తీసుకెళ్లారు. దారి పొడవునా వేలాది మంది ప్రజలు సంతాపం తెలిపారు.
సొంత తోటలో
అంతిమ యాత్రకు ముందు ఆదిచుంచనగిరి మఠం నిర్మలానందనాథ స్వామి, ఎస్.ఎం.కృష్ణ సతీమణి ప్రేమ, ఆయన కుమార్తెలు, మనవళ్లు, ఆయన సమీప బంధువు ఉప ముఖ్యమంత్రి డీ.కే.శివకుమార్‌లు పార్థివ దేహానికి పూజలు చేశారు. ఆ తరువాత ఊరేగింపు ప్రారంభమై బెంగళూరులోని టౌన్‌హాల్, మైసూరు బ్యాంక్ సర్కిల్, రాజరాజేశ్వరి గేట్, కెంగేరి, బిడది, రామనగర, చెన్నపట్టణ మీదుగా బయల్దేరింది.
సోమనహళ్లిలో సొంత కాఫీ డే తోటలో అంత్యక్రియలు జరిపారు. అంత్యక్రియలకు భారీఎత్తున ఏర్పాట్లు జరిగాయి. సోదరుడు, ఆయన కొడుకు కృష్ణ చితికి నిప్పంటించారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. సీఎం సిద్దరామయ్య, మంత్రులు, ఎమ్మెల్యేలు, రాజకీయ నాయకులు, అధికారులు, అలాగే కేంద్రమంత్రి కుమారస్వామి, మాజీ సీఎం యడియూరప్ప పాల్గొని నివాళులర్పించారు.
మండ్య జిల్లాలోని స్వగ్రామంలో
ఎస్‌ఎం కృష్ణ అంత్యక్రియలు
బెంగళూరు నుంచి అంతిమయాత్ర
దారిపొడవునా జన నివాళి
Comments
Please login to add a commentAdd a comment