యదువీర్ చిన్న కొడుక్కి ఉయ్యాల సేవ
మైసూరు: మైసూరు రాజవంశస్తుడు, మైసూరు–కొడగు ఎంపీ యదువీర్ కృష్ణదత్త ఒడెయర్, త్రిషికా దంపతుల చిన్న కొడుక్కి బుధవారం నగరంలోని చాముండి కొండలో ఊయల శాస్త్రం నెరవేర్చారు. మైసూరు దసరా సమయంలో వారికి రెండో కుమారుడు జన్మించడం తెలిసిందే. ఇప్పుడు కులదేవత చాముండేశ్వరి ఆలయ ఆవరణలో ప్రధాన పురోహితులచే ఊయల శాస్త్రం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంపంగి చెట్టుకు ఉయ్యాల కట్టి పూజలు చేశారు. ఊయల శాస్త్రం ద్వారా యదువంశపు మరొక వంశాంకురాన్ని పరిచయం చేశారు. యదువీర్, త్రిషికా దంపతులకు పెద్ద కుమారుడు ఆద్యవీర్ 2017 డిసెంబర్‌లో జన్మించాడు. రాజవంశీకురాలు ప్రమోదాదేవి పాల్గొన్నారు.
బైక్‌ను ఢీకొన్న లారీ..
దంపతులు బలి
హొసపేటె: కూలీ పనుల కోసం బైక్‌లో గంగావతికి వెళ్తున్న దంపతులు లారీ ఢీకొని దుర్మరణం చెందారు. బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు... మరకుంబి గ్రామానికి చెందిన మంజునాథ్ పరసప్ప నాయక్ (38), భార్య నేత్రావతి (33), బంధువుల పిల్లవాడు మంజునాథ్ (9) కూలీ పని కని గ్రామం నుంచి గంగావతికి బయలుదేరారు. మార్గమధ్యంలో హేరూర్ – కేసరహట్టి మధ్య ఉన్న పెట్రోల్ బంకులో ఇంధనం నింపారు. బంక్ నుంచి రోడ్డు పైకి రాగానే, ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో దంపతులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ వెనుక కూర్చున్న బాలుడు మంజునాథ్ దూరంగా ఎగిరి ముళ్ల పొదల్లోకి పడిపోయాడు. బైక్ లారీ కింద చిక్కుకుపోయింది. ఘటనాస్థలి బీభత్సంగా మారిపోయింది. వెంటనే స్థానికులు మృతదేహాలను బయటకు తీశారు. బాలున్ని ఆస్పత్రికి తరలించారు. లారీని డ్రైవర్ వదిలేసి పరారయ్యాడని పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment