కోలారు: శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇచ్చే వాత్సల్య పథకంలో భాగంగా తాలూకాలోని అరాభికొత్తనూరు గ్రామంలో నిర్మించిన వాత్సల్య మనె ఇంటిని లబ్దిదారుకు అందజేశారు. ఈ సందర్భంగా సమాజ సేవకుడు సిఎంఆర్ శ్రీనాథ్ మాట్లాడుతూ...శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రభుత్వం చేపట్టాల్సిన సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తుండడం సంతోషించదగిన విషయమన్నారు. ఎలాంటి ఫలాపేక్ష లేకుండా సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తుండటం హర్షనీయమన్నారు. అన్న దాసోహానికి ప్రఖ్యాతి గాంచిన శ్రీ ధర్మస్థల క్షేత్రం సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ఎంతో ముందుందన్నారు. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు పెన్షన్లు, దేవాలయాల జీర్ణోద్దారణ, చెరువుల పునఃశ్చేతన కార్యక్రమాలను నిర్వహిస్తుండడం ఎంతో మంచి కార్యమన్నారు. ఈ సందర్భంగా జేడీఎస్ నాయకులు బణకనహళ్లి నటరాజ్, గ్రామ పంచాయతీ సభ్యుడు నంజుండగౌడ, శ్రీ క్షేత్ర ధర్మస్థల గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లా డైరెక్టర్ పద్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment