నగల అంగడికి టోపీ.. మహిళ అరెస్టు
దొడ్డబళ్లాపురం: మాజీ మంత్రి మనిషినని చెప్పుకుని నగల దుకాణంలో కోట్ల రూపాయల విలువైన నగలను కాజేసిన మహిళను బెంగళూరు పులకేశినగర పోలీసులు అరెస్టు చేశారు. బాగలగుంటె నివాసి శ్వేతాగౌడ నిందితురాలు. కమర్షియల్ స్ట్రీట్‌లోని ఓ నగల షోరూంకి వెళ్లి, తాను ఆభరణాల వ్యాపారం చేయబోతున్నానని, మీ వద్దే పెద్దమొత్తంలో నగలు కొంటానని, మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌కు బాగా కావాల్సిన మనిషినని పరిచయం చేసుకుంది. ఆమె మాటలు నమ్మిన జ్యువెలర్స్ యజమాని ఆగస్టు 26 నుంచి డిసెంబరు 8 వరకూ రూ.2.42 కోట్ల విలువైన ఆభరణాలు ఇచ్చాడు. ఆ తరువాత ఆమె డబ్బులు ఇవ్వలేదు, అడిగితే బెదిరింపులకు పాల్పడింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా, మైసూరులో శ్వేతాగౌడను అరెస్టు చేసి బంగారు నగలు, ఓ కారును రికవరీ చేసుకున్నారు. విచారణకు రావాలని మాజీ మంత్రి వర్తూరు ప్రకాశ్‌కు నోటీసులు ఇచ్చారు. ప్రకాశ్ మాట్లాడుతూ తనను రోజూ ఎంతోమంది కలుస్తుంటారని, శ్వేతాగౌడ కూడా కలిసి సమాజసేవ చేస్తుంటానని చెప్పిందన్నారు. విచారణకు వెళతానన్నారు.
మైసూరు ఫాంహౌస్‌లో దర్శన్
మైసూరు: జిల్లాలోని టీ.నరసీపుర మెయిన్ రోడ్డులోని కెంపయ్యనహుండి సమీపంలోని ఇష్టమైన సొంత ఫాంహౌస్‌లో సినీ నటుడు దర్శన్ తూగుదీప బస చేశారు. చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి విడుదలైన ఆయన ఫాంహౌస్‌కు వచ్చారు. ఆనాడు ఆయన అరెస్టయింది కూడా మైసూరులోనే. బెంగళూరులోని సీసీహెచ్ 57వ సెషన్స్ కోర్టు వచ్చే జనవరి 5 వరకు మైసూరులో ఉండేందుకు దర్శన్‌కు అనుమతించింది. దీంతో ఆయన తన అక్క కుమారుడు చందన్, తల్లి మీనా తూగుదీప, భార్య విజయలక్ష్మి, నటుడు ధన్నీర్‌తో కలిసి ఫాంహౌస్‌కు వచ్చారు.
ఘనంగా పుష్పయాగం
చింతామణి: పట్టణంలోని ఓ కళ్యాణ మండపంలో ధనుర్మాసం సందర్భంగా లోక కళ్యాణార్థం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరస్వామి సహస్ర కలశాభిషేకం, పుష్పయాగాలను ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పాల్గొని పూజలు చేశారు. అందరూ సుభిక్షంగా ఉండాలని హోమాలు చేశారు.
బాలికపై కుక్కల దాడి
మైసూరు: వీధి కుక్కల దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడిన ఘటన తాలూకాలోని జయపుర గ్రామంలో జరిగింది. బరడనపుర గ్రామ నివాసి గురుస్వామి కుమార్తె త్రిషిక అన్నపూర్ణేశ్వరి పాఠశాల నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా ఆమైపె వీధి కుక్కల గుంపు దాడి చేసింది. బాలికకు చేతితో పాటు శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. అక్కడే ఉన్న గ్రామస్తులు గమనించి గట్టిగా అరిచి కుక్కలను పారదోలి బాలికను రక్షించారు. తీవ్రంగా గాయపడిన త్రిషిక ను నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
ఇంటి లీజు అని
రూ.2 కోట్ల వసూలు
యశవంతపుర: నగరంలో ఇళ్ల బాడుగ, విక్రయాల పేరుతో కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తన ఇంటిని లీజుకు ఇస్తానని నమ్మించి 22 మంది నుంచి రూ. 2 కోట్లు వసూలుచేసిన వంచకున్ని బెంగళూరు హెబ్బాళ పోలీసులు అరెస్ట్ చేశారు. హెబ్బాళ జోళనగరకు చెందిన గిరిశ్ ఏడాది నుంచి తన ఇంటిని సోషల్ మీడియాలో పెట్టి లీజుకు ఇస్తానని తెలిపాడు. అనేక మంది ఇంటిని చూశారు. ఇల్లు నచ్చిందని, లీజుకు కావాలని చెప్పగా, రూ.8 లక్షల నుంచి 13 లక్షలు వరకు కట్టించుకున్నాడు. ఇలా 22 మంది నుంచి డబ్బులు వసూలు చేశాడు. ఇంట్లో చేరతామని ఒత్తిడి చేస్తే ఏదో ఒక కారణం చెప్పి వద్దనే వాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment