బైక్‌ను లాక్కెళ్లిన బస్సు
● విద్యార్థి దుర్మరణం
దొడ్డబళ్లాపురం: బైక్ ప్రమాదంలో యువకుడు మృతిచెందిన సంఘటన దొడ్డబళ్లాపురం– దేవనహళ్లి రహదారి మార్గంలోని రంగుల ఫ్యాక్టరీ ముందు చోటు చేసుకుంది. గీతం యూనివర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదివే మనోజ్ (19) మృతుడు. బుధవారం సెలవు కావడంతో హాస్టల్ నుంచి బైక్‌లో బయటకు వచ్చాడు. వెనుక వస్తున్న ఒక కారు అతని బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ కిందపడిపోగా, వెనుక వస్తున్న ప్రైవేటు కంపెనీ బస్సు బైక్‌మీదకెక్కి 100 మీటర్ల దూరం లాక్కెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మనోజ్‌ను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
రెండు కార్లు ఢీ..
నలుగురు దుర్మరణం
● హావేరి జిల్లాలో ఘోర ప్రమాదం
సాక్షి,బళ్లారి: హావేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం సిగ్గావి తాలూకా సమీపంలో బెంగళూరు– పూణె హైవేలో ధార్వాడ– హావేరి సరిహద్దుల్లో తడాస్ క్రాస్ వద్ద రెండు కార్లు ఢీ కొన్న ఘటనలో బెంగళూరు చామరాజపేటకు చెందిన చంద్రమ్మ(59) ఆమె కుమార్తె, హరిహరవాసి మీనా (38) కారు డ్రైవర్ కమ్ ఓనర్ మహేష్‌కుమార్ (41), బాలుడు ధన్వీర్ (11) మృతి చెందారు. వీరందరూ ఒకే కారులో వెళ్తున్న ఒకే కుటుంబీకులని తెలిసింది. వేగంగా వస్తున్న ఎస్‌యూవీ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటుకుని వచ్చి వీరు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిగా హుబ్లీ కిమ్స్ ఆస్పత్రిలో తీసుకెళ్లిన తర్వాత చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జుగా మారింది. మరో కారులోని ఇద్దరికి గాయాలు తగిలాయి. స్థానికులు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
పోయిన బ్యాగు దొరికింది
తుమకూరు: మహిళ పోగొట్టుకున్న బ్యాగును రవాణా అధికారి నిజాయతీగా అప్పగించారు. వివరాలు.. నగరంలోని మడిలు ఆస్పత్రి మెట్లపై గుర్తు తెలియని బ్యాగ్ పడి ఉండటాన్ని గమనించిన ఆర్టీఓ ఇన్‌స్పెక్టర్ సద్రుల్లా షరీఫ్ ఆ బ్యాగ్‌ను తీసుకుని చుట్టుపక్కల విచారించారు. తమది కాదని అందరూ చెప్పారు. వెంటనే హొస బడావణె పోలీసు స్టేషన్‌కు వెళ్లి బ్యాగ్‌ను అప్పగించారు. ఆ బ్యాగ్‌లో రూ.8 వేల నగదు, ఒక మొబైల్, ఇంటి లాకర్ కీ, బీరువా తాళాలతో సహా ఇతర వస్తువులు ఉన్నాయి. పోలీసులు బ్యాగ్‌లోని కొన్ని కాగితాల ద్వారా మడిలు ఆస్పత్రి, స్కానింగ్ సెంటర్‌కు వెళ్లి వివరాలు సేకరించారు. ఆస్పత్రి సిబ్బంది ద్వారా సొంతదారు మొబైల్ ఫోన్ నంబరు తీసుకుని కాల్ చేశారు. నగరంలోని ఉప్పారహళ్లికి చెందిన నేత్రావతి, ఆమె కూతురు వచ్చి తమ బ్యాగ్‌ను తీసుకున్నారు. బ్యాగు పోయిందని బాధలో ఉన్న సమయంలో దొరికిందని ఆనందం వ్యక్తం చేశారు. ఆర్టీఓ ఇన్‌స్పెక్టర్ సద్రుల్లా షరీఫ్‌కు, పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.
బెళగావి జిల్లాలో
బడులకు సెలవు
బనశంకరి: బెళగావి జిల్లాలో గురు, శుక్రవారాలు ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు సెలవు ప్రకటించారు. బెళగావిలో కాంగ్రెస్ పార్టీ మహాసభలు జరుగుతున్న సందర్భంగా పిల్లలకు ఇబ్బంది కలగకుండా సెలవులు ఇచ్చారు. ప్రభుత్వ ఎయిడెడ్, ఎయిడెడ్ రహిత పాఠశాలలకు సెలవు వర్తిస్తుందని కలెక్టర్ మహ్మన్ రోషన్ తెలిపారు. 26, 27 తేదీల్లో భారీ ఎత్తున సభలు జరగబోతున్నాయి. అయితే పార్టీ సభలు జరిగితే పిల్లలకు సెలవు ఇవ్వడం ఏమిటని కొందరు విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment